Mahaa Daily Exclusive

  సీతారామన్, జైశంకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ..

Share

రెండురోజుల టూర్‌లో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బిజి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు.

 

శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి అధికారిక నివాసానికి చేరుకున్నారు. తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో దాదాపు 45 నిమిషాల సేపు సమావేశమయ్యారు.

 

వరదల ధాటికి అతలాకుతలమైన విజయవాడ నగరాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా ఒక శాతం అదనపు సర్ ఛార్జ్‌ని విధించే వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నదుల అనుసంధానం గురించి చర్చ జరిగింది.

 

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో ఏపీని కరువు రహితంగా మార్చాలని భావిస్తున్నామన్నారు. ఇది ఏపీకి ముఖ్యమైన అంశంగా చెప్పుకొచ్చిన సీఎం, కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

 

నదుల అనుసంధానం విషయంలో యూపీ, ఎంపీ రాష్ట్రాల(కెన్-బెట్వా రివర్ లింకింగ్) మాదిరిగా ఏపీకి సాయం చేయాలని కోరారు. దీంతో కరువు పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు అందించవచ్చని సీతారామన్‌కు వివరించారు.

 

నదుల అనుసంధానం సాయంపై సానుకూలంగా స్పందించిన ఆర్థికమంత్రి, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె సూచించారు. కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని వాటికి నిధులు సహాయం చేయాలని చెప్పుకొచ్చారు.

 

విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సీఎం చంద్రబాబు అరగంటకు పైగానే భేటీ అయ్యారు. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు, తీసుకోనున్న పాలసీలు, భారత ఆర్థిక రంగంపై ప్రభావం గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

 

ఏపీ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి వెళ్తుండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాల ప్రభావంపై ఆయనతో చర్చించారు. విదేశాలకు వెళ్లే సమయంలో ఏపీ విద్యార్థులకు ఎదురవుతున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు.

 

దీనికితోడు అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ, మరింత త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ సహకారాలను అందించాలని విన్నవించారు.