కోల్‌కతా,మహా.
రాజకీయంగా తనను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదని, తన ప్రస్థానాన్ని ఆపాలంటే తన ప్రాణాలు తీయాల్సిందేనని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్న తిరుగుబాటు నాయకులను ఆమె నమ్మకద్రోహులుగా అభివర్ణించారు. పార్టీ అధికారిక గుర్తు ఎక్కడికీ పోదని, అది తన వెంటే ఉన్న నిజమైన నమ్మకస్థుల వద్దే పదిలంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పార్టీ సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య రాజీనామా వ్యవహారంపై మమత ఈ సందర్భంగా స్పష్టతనిచ్చారు. చంద్రిమా భట్టాచార్య శనివారం తన పదవికి రాజీనామా చేశారని, అయితే ఈ పరిణామంపై ఆమె ముందుగానే తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. చంద్రిమా కుమారుడు యాంటీ-తృణమూల్ వర్గంలో చేరడమే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని ఆమె వెల్లడించారు. అలా వెళ్లడం ఆమె వ్యక్తిగత ఇష్టమని, ఆ స్వేచ్ఛ ఆమెకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. కానీ, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తిరుగుబాటుదారులతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి రాజకీయ బెదిరింపులకు తన పార్టీ ఎన్నటికీ లొంగదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందు తాను తలవంచేది లేదని దీదీ ఉద్ఘాటించారు.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పార్టీ ఆఫీసు వద్దకు వెళ్లి, దానికి తాళం వేసిన వారికి తానొక్కటే స్పష్టం చేస్తున్నానని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆ కార్యాలయాన్ని తాము అద్దెకు తీసుకున్నామని, 2027 అక్టోబర్ నెల వరకు అది తమకే లీజుకు ఇవ్వబడిందని గుర్తు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రాణప్రదంగా భావించే ‘తల్లి, మట్టి, మనుషుల’ (మా, మాటీ, మానుష్) ఆస్తిని ఎవరూ అంత సులభంగా, బలవంతంగా లాక్కోలేరని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.






