- జైష్-ఎ-మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల కీలక నేతలపై కేంద్ర హోం శాఖ వేటు.
ఢిల్లీ, మహా.
భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు భంగం కలిగిస్తున్న శక్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వేదికలుగా భారత్‌పై కన్నేసిన 23 మంది మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ జాబితాలో భారత సరిహద్దుల్లో నిరంతరం అలజడి సృష్టిస్తున్న జైష్-ఎ-మహ్మద్ , లష్కరే తోయిబా తో పాటు వాటి అనుబంధ ఉగ్ర సంస్థలకు చెందిన అత్యంత కీలక నేతలు ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
**17 మంది పాక్ పౌరులు.. ఆరుగురు భారతీయులు..**
కేంద్ర హోం శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నూతన ఉగ్ర జాబితాలో ఉన్న 23 మందిలో 17 మంది పాకిస్థాన్‌కు చెందిన పౌరులు కాగా, మిగిలిన ఆరుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్ మరియు పీవోకే ప్రాంతాల్లో తలదాచుకుంటూ, అక్కడి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా వ్యవస్థీకృత ఉగ్ర కార్యకలాపాలను నడుపుతున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. భారతదేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి నియామకాలు చేపట్టడం, ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహించడం, అంతర్జాతీయంగా ఉగ్ర నిధుల సమీకరణ చేపట్టడం వంటి దేశద్రోహ చర్యలకు వీరంతా పాల్పడుతున్నట్లు హోం శాఖ నోటిఫికేషన్‌లో బట్టబయలు చేసింది.
**నాగ్రోటా, సుంజ్వాన్ దాడుల నిందితులపై నిఘా..**
ఈ నిషేధిత జాబితాలో జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మసూద్ ఇల్యాస్ కశ్మీరీ, మొహమ్మద్ ముసద్దిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, అబ్దుల్లా జెహాదీ వంటి అపఖ్యాతి పాలైన కీలక నేతలు ఉన్నారు. వీరంతా సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, భారత్‌లోకి చొరబాట్లు సజావుగా సాగేలా చూడటంలో సిద్ధహస్తులని కేంద్రం ఆరోపించింది. ముఖ్యంగా 2016లో జరిగిన నాగ్రోటా ఆర్మీ క్యాంప్‌పై దాడి, అలాగే 2022 నాటి సుంజ్వాన్ ఉగ్ర దాడుల వెనుక వీరి ప్రధాన పాత్ర ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయని ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు, లష్కరే తోయిబా దళానికి చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్‌లతో పాటు మరికొందరు ఉగ్రవాదులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరంతా సరిహద్దు రాష్ట్రాల్లోకి భారీగా ఆయుధాలు సరఫరా చేయడం, స్థానిక యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి లాగడం, దాడులకు అవసరమైన లాజిస్టిక్ మరియు ఆర్థిక సహాయాన్ని చేరవేయడంలో కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు.
**సవరించిన యూఏపీఏ చట్టం ద్వారా చర్యలు..**
గతంలో ఉగ్రవాద సంస్థలపై మాత్రమే నిషేధం విధించేందుకు అవకాశం ఉండేది. అయితే, మోదీ ప్రభుత్వం 2019లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టానికి ప్రతిష్ఠాత్మక సవరణలు తీసుకువచ్చింది. ఈ సవరణల ప్రకారం ఉగ్రవాద సంస్థలతో పాటు, దేశ భద్రతకు ముప్పుగా మారిన ఏ వ్యక్తికైనా సరే నేరుగా ‘ఉగ్రవాది’గా ముద్ర వేసే అపరిమిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఈ ప్రత్యేకమైన అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, దేశ అంతర్గత భద్రతను కాపాడే క్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.







