- 20 ఏళ్ల క్రితం నాటిన మొక్కే నేడు మహావృక్షమైంది.
- దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం.
- సీఎం రేవంత్ రెడ్డి.
మిడ్జిల్, మహా.
మిడ్జిల్ మండల ప్రజలు 2006 జూలై 4న తనను జెడ్పీటీసీగా గెలిపించడం తన రాజకీయ జీవితంలోనే అత్యంత చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు దశాబ్దాల క్రితం ప్రజలు నాటిన చిన్న మొక్కే నేడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందున్నానని భావోద్వేగంగా పేర్కొన్నారు. అదే రోజున 20 ఏళ్ల తర్వాత కృతజ్ఞత సభ నిర్వహించడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే సందర్భమని చెప్పారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలు, బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు, జాతీయ రాజకీయాల వరకు పలు అంశాలపై సీఎం విస్తృతంగా మాట్లాడారు.
మిడ్జిల్ ప్రజల విజయమే.. నా విజయం కాదు
2006లో సాధించిన జెడ్పీటీసీ విజయం వ్యక్తిగతంగా తనది కాదని, అది మిడ్జిల్ ప్రజల విజయమని రేవంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆశీర్వదించి గెలిపించిన ప్రజల తీర్పు తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిందన్నారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన రాజకీయ ధ్యేయమని చెప్పారు.
మహబూబ్‌నగర్ గొప్ప నాయకుల నేల
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహానుభావులని సీఎం గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు ద్యాప గోపాల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.
ఓడిన ప్రత్యర్థికీ గౌరవం
తనపై పోటీ చేసి ఓడిన రబ్బానీకి కూడా ప్రభుత్వంలో మంచి బాధ్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు గానీ వ్యక్తిగత ద్వేషాలకు తావు ఉండకూడదని అన్నారు.
మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత
ఒకప్పుడు డార్క్ మండలాలుగా పేరున్న మిడ్జిల్, గట్టు మండలాలను అభివృద్ధి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. మిడ్జిల్ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలని కోరారు. వలసల పాలమూరును అభివృద్ధి బాటలో నడిపించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలు
ప్రస్తుత ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా శాశ్వత అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టిందన్నారు. వందేళ్ల సమస్యకు పరిష్కారంగా కులగణన చేపట్టి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గ్రామీణ సమస్యలు తెలిసిన వ్యక్తిగా వాటికి పరిష్కారం చూపే సామర్థ్యం తనకు ఉందని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు
సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు వంటి హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం వివరించారు.
బీఆర్‌ఎస్‌పై విమర్శలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు ఏమి చేసిందని సీఎం ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, కోటి ఎకరాలకు సాగునీరు వంటి హామీల అమలు ఏమైందని నిలదీశారు. బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కూడా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యంగా మహిళల ఫోన్లు వినడం అమానుషమని వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలే ప్రభుత్వ అజెండా
గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. తమ అక్రమ సంపాదన, దోపిడీకి అడ్డుకట్ట పడటంతోనే కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, ఆయన ప్రధానమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసే ఉద్యమానికి తొలి అడుగు మిడ్జిల్ నుంచే పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.







