Mahaa Daily Exclusive

  మహా ప్రచారంలో రేవంత్ జోరు.. రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో సీఎంప్రచారం..!

Share

  • మహా ప్రచారంలో రేవంత్ జోరు
  • రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో సీఎంప్రచారం
  • షిండే .. అజిత్ పవార్ లు గుజరాత్ గులామ్ లు
  • మహారాష్ట్రలో ప్రజాతీర్పు కాలరాశారు
  • మహా వికాస్ అగాఢీతో నే మహా వికాసం
  • హైదరాబాద్ లో మరో అన్నగా నేను అండగా ఉంటా
  • మార్పుకు ఓటేయండి
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం సుడిగాలి పర్యటనలు

చంద్రాపూర్,

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ షిండే .. అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. షిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రాపూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్‌ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిగ్రాస్ లో మాణిక్ రావు ఠాక్రేను గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు.. హైదరాబాద్‌లో మరో అన్నగా నేను ఉంటా.. అంటూ వెల్లడించారు. మాణిక్ రావు ఠాక్రే నియోజకవర్గంలో పలువురు కూటమి నేతల ఇళ్ళకు సీఎం వెళ్ళి భరోసానిచ్చారు. సీఎంతో పాటు ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేతలు మేఘారెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజూరులో ఎంపీ చామలకిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో రేవంత్ ప్రచారానికి భారీ స్పందన కనిపిస్తుండగా, తెలంగాణ నేతలు ఇన్ ఛార్జిలుగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని సూచించారు.