- అజ్ఙాతమా?
- అస్త్రసన్యాసమా?
- కవిత వ్యూహం పై సర్వత్రా చర్చ
- తండ్రి లాగే కూతురు
- సర్కారు పై అన్న కేటీఆర్, బావ హరీష్ ల పోరు
- అక్క కోసం తమ్ముళ్ల ఎదురుచూపులు
- జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించిన కవిత
- ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత
- బెయిల్ పై బయటికొచ్చాక రాజకీయ వైరాగ్యం
హైదరాబాద్, మహా:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకప్పుడు నిజామాబాద్ గులాబీ సైన్యాన్నే కాకుండా తెలంగాణ జాగృతి ని ముందుండి నడిపిన కవిత లిక్కర్ కేసులో అరెస్టయి బెయిల్ పై వచ్చాక మౌనముద్ర దాల్చారు. తండ్రి కేసీఆర్ లా వ్యూహంతో అజ్ఞాతంలో ఉన్నారా? వైరాగ్యం తో రాజకీయాల నుండి అస్త్రసన్యాసం చేశారా? అన్న ప్రశ్న అనుచరులను, అభిమానులను తొలుస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన కవిత, ఆ తరువాత జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె జైలు నుంచి విడుదలై రెండున్నర మాసాలవుతున్నా గతంలో మాదిరిగా కవిత పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇతర కార్య్రమాల్లో గానీ ఎక్కడా కూడా కనిపించడంలేదు. కేవలం ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు జాగృతి కార్యకర్తలు కలవరానికి గురవుతున్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత కవిత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రభావాన్ని చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడంతో కొంత ఆలోచనలో ఉన్నారు. అరెస్ట్ కాకముందు కవిత ఎప్పుడూ చూసినా బిజీ బిజీగా కనిపించేవారు. పార్టీ కార్యక్రమాలు గానీ, జాగృతి కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ కార్యక్రమాలు గానీ, బతుకమ్మ వేడుకలు గానీ… ఇలా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నిత్యం బిజీ బిజీగా ఉండేవారు. రాజకీయంలోకి రాకముందు కవిత తెలంగాణ ఉద్యంలో పాల్గొన్న సమయంలో కవితకు మంచి గుర్తింపు దక్కింది. తెలంగాణ మహిళల పండుగ అయిన బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తుల్లో ఈమె ఒకరు. జాగృతి పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా బతుకమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశేషాలు ప్రజలకు ఎక్కువగా తెలిసేలా తన వంతు కృషి చేశారు. దీంతో ఆమెకు జనాల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఓ వైపు కేసీఆర్ కూతరుగా.. మరోవైపు తన వాక్చాతుర్యంతో ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తనదైన స్టైల్ లో విమర్శించేవారు. ఇలా కూడా కవితకు గుర్తింపు వచ్చింది. ఇలా ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉండే కవిత ఎందుకు స్తబ్ధుగా ఉన్నారు. ఎప్పుడు చూసినా వార్తల్లో ఆమె పేరు వినిపించేది. కానీ, ఇప్పుడు ఆమె పేరు కనిపించడంలేదని, జైలు నుంచి బయటకు వచ్చాక కవితకు ఏమైంది..? ఎందుకు బయటకు వస్తలేరంటూ వారు ఆలోచనలు చేస్తున్నారు.
జైలు నుంచి విడుదలైన సందర్భంగా కవిత శపథం చేశారు. తనని ఆ కేసులో కొంతమంది కావాలనే ఇరికిరించారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోనని అన్నారు. చివరకు న్యాయమే గెలుస్తుందంటూ ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు, ఆమె అనుచరులు అంతా అనుకున్నారు ఇక నుంచి కవిత పెద్ద ఎత్తున గళం విప్పబోతున్నారని అనుకున్నారు. తన వాక్చాతుర్యంతో అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపిస్తారనుకున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆమె తనదైన శైలిలో పార్టీకి మద్దతుగా గొంతు ఎత్తుతారని అనుకున్నారు. కానీ, అటువంటి పరిస్థితి లేకపోవడంతో వారంతా ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు. అసలు కవిత ఎందుకు ఇంటి నుంచి బయటకు రావడంలేదో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారంటా. ఓ వైపు తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మరోవైపు మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా తమ వాణిని వినిపిస్తున్నారు. కానీ, జైలు నుంచి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఎందుకు కవిత బయటకు రావడంలేదని ఆరా తీస్తున్నారు. ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారనుకుంటే ఎందుకు సైలెంట్ అయ్యారని అంతా చర్చించుకుంటున్నారు.
ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీశ్ రావు నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి పిలుపు వచ్చిన వెంటనే అక్కడ వాళిపోతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంపై తమదైన స్టైల్ లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వారి పేర్లు జనాల నోట్లో ఆడుతున్నాయి. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా అవకాశం ఉన్న ప్రతిసారి గళం విప్పుతూ జనాల్లోనే ఉంటున్నారు. మహిళా నేతలు కూడా ప్రభుత్వంపై అటు అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి జనాల వద్దకు వెళ్లి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా మీడియాతో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. అయితే, వీరంతా నిత్యం జనాలతో ఉంటూ గళం విప్పుతుంటే ఇటు కేసీఆర్, అటు కవిత మాత్రం ఇంటి నుంచి బయటకు రావడంలేదు. ఎందుకు వీళ్లిద్దరు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదనేది తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ తరువాత ఎర్రవల్లికి వెళ్లి తన తండ్రిని కలిశారు. ఆ తరువాత మరో రెండు సందర్భాల్లో కవిత కనిపించారు. ఈ సందర్భాల్లో తప్ప మరెప్పుడూ ఆమె కనిపించలేదు. ఆమె వాయిస్ వినిపించలేదు. ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ తెగ యాక్టీవ్ గా ఉండే ఆమె చాలా సైలెంటైపోయారు. దీంతో కవిత ఎక్కడా అంటూ నెట్టింటా కామెంట్స్ వస్తున్నాయి. అటు దసరా పండుగప్పుడు నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో కవిత పేరు బాగా వినిపించేది. బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొనేవారు. కానీ, ఈసారి మాత్రం కవిత బతుకమ్మ వేడుకల్లో కనిపించలేదు. ఈ క్రమంలోనే కవిత ఎందుకు ఇంటి నుంచి బయటకు రావడంలేదు? అని, సైలెంట్ గా ఉండి ప్రభుత్వాలపై పోరాడేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా రచిస్తున్నారా? అని ప్రజలు ఆలోచిస్తున్నారంటా. కేసీఆర్, కవితతోపాటు పలువురు నేతలు సైలెంట్ గా ఉండడంతో కేడర్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారంటా.