Mahaa Daily Exclusive

  చిన్న వర్షానికే హైదరాబాద్ చెరువవుతోంది..! కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి..!

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో డ్రైనేజీ, రోడ్ల నిర్వహణ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఆదివారం పర్యటించిన ఆయన వివిధ పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

‘పూడికతీత పనులు ఎక్కడా కనిపించడం లేదు’

 

నగరంలోని మురుగు కాలువల పూడికతీత పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో ప్రతి వర్షానికీ రహదారులు నీట మునుగుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ప్రజలు ప్రతిరోజూ ట్రాఫిక్ ఇబ్బందులు, నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

 

‘లండన్.. సింగపూర్ అంటున్నారు.. వాస్తవం వేరే’

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను లండన్, సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామని చెప్పిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా హామీలు ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అయితే మాటలకు తగ్గట్టుగా నగరాభివృద్ధి కోసం ఎలాంటి సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా ప్రజలకు కనిపించే మార్పు ఏదీ లేదని పేర్కొన్నారు.

 

ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఓపెన్ జిమ్‌లు

 

‘ఫిట్ ఇండియా – హెల్త్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

 

నీటి సంరక్షణపై పిలుపు

 

ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. అందువల్ల నీటి వృథాను అరికట్టి వర్షపు నీటి సంరక్షణపై ప్రతి పౌరుడు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

 

‘కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరం’

 

హైదరాబాద్ వేగంగా కాంక్రీట్ జంగిల్‌గా మారుతోందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, నిర్మాణాలు పెరగడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మరింత పెరిగిందని, నగరంలో పచ్చదనాన్ని విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.

 

ఇంకుడు గుంతల ఏర్పాటుకు సూచన

 

ప్రతి ఇంటిలో, ప్రతి పార్కులో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షపు నీరు మూసీ నది ద్వారా సముద్రంలో కలిసిపోకుండా భూగర్భ జలాలను పెంచేలా ఇంకిపోయే విధానాలను అమలు చేయాలని సూచించారు. నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావడం ద్వారానే భవిష్యత్ తరాలకు తాగునీటి భద్రత సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Latest