Mahaa Daily Exclusive

  సన్న వడ్ల బోనస్‌కు కొత్త మార్గదర్శకాలు..! అర్హులకే ప్రయోజనం..

Share

హైదరాబాద్, మహా.

సన్న వడ్ల బోనస్ పంపిణీలో పూర్తి పారదర్శకత తీసుకురావడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2026 వానాకాలం సీజన్ నుంచే అమల్లోకి రానున్నాయి. బోనస్‌కు అర్హులైన రైతులకు మాత్రమే ప్రభుత్వ ప్రోత్సాహకం అందేలా పటిష్టమైన వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు తప్పనిసరి

 

కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతులు విక్రయించిన సన్న వడ్లకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రం లేదా డీలర్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రైతు వివరాలు, విక్రయించిన ధాన్యం రకం, పరిమాణం, కొనుగోలు తేదీ తదితర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఈ విధానంతో ప్రతి లావాదేవీని డిజిటల్‌గా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

 

అక్రమాలకు అడ్డుకట్టే లక్ష్యం

 

ఇతర రకాల వడ్లను సన్న వడ్లుగా చూపించడం, తప్పుడు వివరాలతో బోనస్ పొందే ప్రయత్నాలను అరికట్టడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ నమోదు ద్వారా ప్రతి రైతు విక్రయించిన ధాన్యాన్ని ధృవీకరించి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే బోనస్ అందేలా చర్యలు తీసుకోనున్నారు.

 

ఈ రకాలకే బోనస్

 

ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం కింది సన్న వడ్ల రకాలకు మాత్రమే బోనస్ వర్తించనుంది.

 

అభినీత్ – 15048, బీపీటీ – 5204, కేఎన్‌ఎం – 1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్ – 44, కేఎన్‌ఎం – 7715.

 

ఈ రకాల ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించిన రైతులకే ప్రోత్సాహక బోనస్ అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

రైతులకు స్పష్టమైన సూచనలు

 

సన్న వడ్లు విక్రయించే రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి వివరాలు, ధాన్యం విక్రయానికి సంబంధించిన రసీదులు సక్రమంగా నమోదు అయ్యాయో లేదో కొనుగోలు కేంద్రం వద్దనే నిర్ధారించుకోవాలని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని తెలిపారు.

 

పారదర్శకతకు ప్రాధాన్యం

 

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనస్ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యే విధంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొనుగోలు ప్రక్రియ నుంచి బోనస్ చెల్లింపుల వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Latest