Mahaa Daily Exclusive

  విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు..!

Share

గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.

 

కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకొని వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు. నోటీసులు అందినవారు విచారణకు హాజరు కావాలని కోరినట్టు సమాచారం.