అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో అక్రమ నిర్మాణంపై కొరడా ఝులిపించింది.
సర్వే నంబర్ 848 రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేసింది. రెండు వారాల కిందట నోటీసులు ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో భారీ యంత్రాలతో వాటిని కూల్చివేసింది.
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు చోట్ల ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లు కూల్చివేసిన విషయం తెల్సిందే.
న్యాయస్థానం మార్గ దర్శకాల ప్రకారం ముందుగా నోటీసులు ఇస్తోంది. అందుకు 15 రోజులు గడువు ఇస్తోంది. రెండు వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే రంగంలోకి దిగుతోంది హైడ్రా.
మరోవైపు వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్ నంబర్-5లో 150 ఫీట్ల పొడవైన రోడ్డును 4 ఫీట్ల వరకు కబ్జా చేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెళ్లాయి.
స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు. అయితే పైపై మెరుగులు దిద్దినట్లుగా కూల్చి వెళ్లిపోయారన్నది కాలనీ వాసులు ఆరోపణ. రోడ్డుపై కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చాలన్నది కాలనీ వాసుల డిమాండ్.