Mahaa Daily Exclusive

  కావాలనే దాడి చేశారు.. లగచర్ల గ్రామస్థుల అంగీకారం..

Share

జిల్లా అధికారులపై దాడి ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు లగచర్ల వచ్చిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు గ్రామస్థులు కీలక విషయాలు వెల్లడించారు. దాడికి తాము ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేసుకోలేదన్న గ్రామస్థులు.. దాడి తీరును పరిశీలిస్తే, ఎవరో కావాలని చేసినట్లు అనిపిస్తోందని అన్నారు. గతంలో తామకు తెలియని చాలా మందిని ఆ రోజు గ్రామంలో చూసామని వెల్లడించారు. అప్పటివరకు తమ మధ్య లేని కొందరు వ్యక్తులు ఒక్కసారే వచ్చి కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ ను కొట్టండి అంటూ అరిచారని ఆరోపించారు.

 

భూసేకరణ విషయంలోనూ రైతులు సానుకూలంగానే ఉన్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణలో వెల్లడైంది. నష్టపరిహారం అందిస్తే భూములు ఇచ్చేందుకు గ్రామంలోని కొంత మంది రైతులు సుముఖంగానే ఉన్నట్లు వారు తెలిపారు. కానీ.. మరి కొందరికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని అధికారులకు విన్నవించుకునే లోపే.. ఇలాంటి దారుణం చోటుచేసుకుందని తెలిపారు. ఇదంతా ఎవరో సొంత లాభం కోసం చేసినట్లు అనిపిస్తోందని లగచర్ల గ్రామస్థులు.. కమిషన్ ముందు విన్నవించుకున్నారు.

 

అయితే.. లగచర్ల ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భూసేకరణ అంశంలో లగచర్ల గ్రామస్థులను, రైతులను రాఘవేందర్ అనే పంచాయితీ సెక్రటరీ రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అధికారులపై దాడికి సిద్దంగా ఉండాలని గ్రామస్థుల్ని రాఘవేందర్ ప్రేరేపించినట్లు తెలిసింది. ఇతను వికారాబాద్ జిల్లా సంగయ్యపల్లిలో పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. దాడి ఘటనలో రాఘవేందర్ పాత్రను గుర్తించి.. ఇప్పటికే.. అతనని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసారు. పోలీసులు సైతం.. ప్రాథమిక విచారణలో అతని పాత్ర బయటపడడంతో.. అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపించారు.

 

లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే.. రైతుల ముసుగులో దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు శాఖ పరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. అధికారులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోనందుకు, వారికి సరైన రక్షణ కల్పించడంలో విఫలమైన కారణంగా.. పరిగి డీఎస్సీ కరుణసాగర్‌ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.