Mahaa Daily Exclusive

  పదివేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఔట్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..!

Share

  •   కేసీఆర్ తెచ్చిన జీవో 16ను కొట్టివేసిన హైకోర్టు
  • – ఈ జీవో రద్దుచేయాలని పోరాడిన నిరుద్యోగ జెఏసి
  • – హైకోర్టు తీర్పు అమలుచేస్తే భారీగా ఉద్యోగ ఖాళీలు

 

హైదరాబాద్, మహా

 

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేస్తూ గత కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 16ను కొట్టి వేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టి వేసింది.

 

రెగ్యులరైజ్‌ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు. అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్‌ కాపీ వస్తేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. దీంతో జీవో నంబర్ 16తో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై రేవంత్ సర్కార్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది. అప్పీలుకు వెళ్తుందా? లేదా కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా? అన్న అంశంపై ఆయా ఉద్యోగుల్లో టెన్షన్ వ్యక్తం అవుతోంది.

 

కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 16ను తీసుకువచ్చిన సమయంలో నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ జీవో రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపమని ఫైర్ అయ్యింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది నిరుద్యోగులు నష్టపోతారని.. ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై సుధీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

 

జీవో 16పై అభ్యంతరాలివే

 

కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు జరిగే సమయంలో రిజర్వేషన్లను పాటించరు. అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి నియమాక పరీక్షలను కూడా నిర్వహించరు. కాంట్రాక్ట్ నియామకాల్లో అవకతకవలు జరుగుతాయని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు వారికి నచ్చిన వారికి కాంట్రాక్ట్ విధానంలో అవకాశం కల్పిస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారిని రెగ్యూలరైజ్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని.. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

 

రెండేళ్ళక్రితం

జీవో 16 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2022 మార్చిలో నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుండి వివరాలు తీసుకుంది. సమాచారం ప్రకారం 11103 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులతో క్రమబద్దీకరించారు.