యుద్దం. గెలిచినా ఓడినా రెండువైపులా ఎంతోనష్టం. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన రష్యా- ఉదక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మంగళవారంతో 1000 రోజులైంది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 80వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో ప్రాణాలొదిలారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య.. కీవ్‌లో వినాశనానికి దారితీసింది. పరస్పర క్షిపణి దాడులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ లో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మరి రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న ఈ పోరు మిగిల్చిన విషాదం పై అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలొచ్చాయి. పశ్చిమదేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇప్పటివరకు అటు రష్యా వైపు కూడా దాదాపు 2 లక్షల మంది మాస్కో సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 31, 2024 నాటికి కీవ్ వైపు కనీసం 11,743 మంది సామాన్యులు యుద్ధంలో మృతి చెందినట్లు అంచనా. మరో 24,600 మంది గాయపడ్డారు. అయితే, పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా అధీనంలో ఉండటంతో అక్కడి బాధితులను తాము గుర్తించలేకపోతున్నామని తెలిపారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు దారుణంగా తగ్గిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఇక, దాదాపు 40లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలివెళ్లాల్సి వచ్చింది. ఇక 60లక్షల మందికి పైగా పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా గతేడాది డిసెంబరు నాటికి ఉక్రెయిన్ 152 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్, ఐరాస అంచనా వేశాయి. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థికసాయాన్ని అందించాయి. ఇప్పటివరకు కీవ్ 100 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఇపుడు బైడెన్ తీసుకున్న చర్యతో ఈ యుద్దం ఎపుడు ముగుస్తుందో.. ఎంత విషాదాన్ని మిగులుస్తుందో చెప్పలేని స్థితి. రెండో ప్రపంచ యుద్దం తర్వాత రెండు దేశాల మధ్య ఓ యుద్దం వేయి రోజులకు పైగా కొనసాగడం రెండు దేశాల పౌరులకు ఎన్నో కష్టనష్టాలు మిగిల్చింది…