Mahaa Daily Exclusive

  తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం …హైబ్రిడ్ వాహనాలకు పన్ను రాయితీ..!

Share

వాహన కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం రాయితీ అమలు చేస్తున్న ప్రభుత్వం .. తాజాగా హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపైనా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌పై పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

 

బ్యాటరీ, పెట్రోల్ లేదా బ్యాటరీ, డీజిల్ కాంబినేటేషన్ లో హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం రాయితీ ఇవ్వాలని రవాణా శాఖ యోచిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలన్నీ బంద్ చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.

 

రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే కాలం చెల్లిన (15 ఏళ్లు దాటిన) వాహనాలను ప్రజలు స్వచ్చందంగా స్క్రాప్ చేయాలని సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)నే కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.