Mahaa Daily Exclusive

  సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు.. రిలయన్స్ బయోగ్యాస్ రాబోతోంది: చంద్రబాబు..

Share

వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, అయితే చెత్తను మాత్రం ఎత్తలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము చెత్త పన్నును రద్దు చేశామని… చెత్తను తీయిస్తున్నామని చెప్పారు. అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని అన్నారు. అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

రోడ్లపై గుంతలు పూడ్చడానికి రూ. 860 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను తయారుచేస్తామని చెప్పారు. రూ. 75 వేల కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ. 30 నుంచి 40 వేల కోట్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం సహకరించిందని తెలిపారు.

 

ఎన్టీపీసీ, జెన్ కో జాయింట్ వెంచర్ తో విశాఖలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని చంద్రబాబు చెప్పారు. రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయోగ్యాస్ రాబోతోందని తెలిపారు. ఈ బయోగ్యాస్ తో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల కోసం 25 పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించామని చెప్పారు.

 

గంజాయి, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని… దోషులకు శిక్ష విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

 

రాష్ట్రంలో ఇప్పటికే 101 అన్న క్యాంటీన్లు ఉన్నాయని… భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. బుక్ చేసుకున్న వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని తెలిపారు. విజయవాడ వరదల సమయంలో రూ. 500 కోట్ల విరాళాలు వచ్చాయని… తమ ప్రభుత్వంపై నమ్మకంతో దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని చెప్పారు.