Mahaa Daily Exclusive

  నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది..-: రామ్ గోపాల్ వర్మ

Share

గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై పోలీసు కేసు నమోదయింది. విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

 

నిన్న జరగాల్సిన పోలీసు విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని… విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని… నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు.

 

మరోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

 

ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని… వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.