Mahaa Daily Exclusive

  అదానీపై లంచం కేసు.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కీలక ప్రకటన..

Share

బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చుట్టూ వివాదం అలముకున్న వేళ భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

అదానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి వచ్చిందని పియర్ చెప్పారు. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజీ) మాత్రమే సరైన సమాచారం ఇవ్వగలవని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పట్లానే బలంగా ఉన్నాయని వివరించారు. ‘‘నేనేం చెప్పాలనుకుంటున్నానంటే భారత్, యూఎస్ మధ్య సంబంధాలు బలమైన పునాదులపై నిలబడి ఉన్నాయి. ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాయి’’ అని తెలిపారు.

 

గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. సోలార్ పవర్ ఒప్పందాలకు సంబంధించి భారత్‌లో దాదాపు రూ. 2,100 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచంగా ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారన్న అభియోగాలు నమోదయ్యాయి. అదానీ సహా 8 మందిపై కేసు నమోదైంది.