Mahaa Daily Exclusive

  రేపటి నుంచి 45 రోజుల ఇంటింటి ప్రచారం….

Share

రేపటి నుంచి 45 రోజుల ఇంటింటి ప్రచారం.
* ప్రజల్లోనే ఉండండి.. నాయకులుగా ఎదగండి.
* ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, మహా.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోమవారం నుంచి 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రభుత్వ పనితీరును వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి విజయానికి ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో కూటమి విజయం సాధించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్లే అప్పటి అధికార పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైందని విమర్శించారు. టీడీపీతో పాటు మిత్రపక్షాల సమిష్టి కృషి, వ్యూహాత్మక ఎన్నికల నిర్వహణ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. బూత్ కన్వీనర్లు, పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు.

‘అనుచరులుగా కాకుండా నాయకులుగా ఎదగాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారాలు చూపే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీలతో ప్రజల వద్దకు వెళ్లినట్లే, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని చెప్పారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచాలని కోరారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులంతా ఈ అవుట్‌రీచ్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఏమరుపాటుకు తావివ్వొద్దని హెచ్చరించారు. యువత సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థి పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

కేవలం డబ్బుతో ప్రజల మద్దతు సంపాదించలేమని, ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి విశ్వాసాన్ని గెలుచుకోవడమే రాజకీయ విజయానికి మూలమని చంద్రబాబు అన్నారు. అగ్రస్థాయి నాయకుల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.