పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు.
* యశోదకు తరలింపు.. ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా.
హనుమకొండ, మహా.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన తరలింపునకు ప్రభుత్వం ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయగా, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు అంబులెన్స్ వెంట హైదరాబాద్‌కు బయల్దేరారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సుదర్శన్‌రెడ్డి మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన నేపథ్యంలో రోహిణి ఆసుపత్రి వైద్యులు వెంటనే స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గుండెపోటు కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్య బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
గుండెపోటు విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు. రోహిణి ఆసుపత్రి వైద్యులతో హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ వరంగల్ చేరుకుని ఆసుపత్రిలో వైద్యులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించే నిర్ణయం తీసుకున్న తర్వాత అంబులెన్స్ వెంట హైదరాబాద్‌కు బయల్దేరారు.
మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని కేటీఆర్‌కు సూచించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, వైద్యులతో ఫోన్లో మాట్లాడి చికిత్స పురోగతిని తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా సూచించారు.
సుదర్శన్‌రెడ్డి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన రోహిణి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమతను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. గుండె లయ ఆగిపోవడంతో పలుమార్లు సీపీఆర్ నిర్వహించి ఆయనను ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారని కొనియాడారు. డాక్టర్ మమత వంటి వైద్యులు వైద్య వృత్తి గొప్పతనానికి నిదర్శనమని, అలాంటి వైద్యులు భూమిపై ఉన్న దేవుళ్లతో సమానమని ప్రశంసించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణిస్తోందని వెల్లడించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు సహకరించి ఆందోళనకు గురికాకుండా వైద్యులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాథమిక సమాచారం వెల్లడవగా, పూర్తి వైద్య బులెటిన్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








