Mahaa Daily Exclusive

  తెలంగాణ జాగృతిలో కీలక మార్పు

Share

  • కొత్త అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియామకం
  • ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్న కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మహా : తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతికి కొత్త అధ్యక్షురాలు నియమితులయ్యారు. గత రెండు దశాబ్దాలుగా సంస్థను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా మాత్రమే కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కొత్త అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవికి బాధ్యతలను అప్పగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన కవిత. సంస్థ ప్రయాణంలో ఇది ఒక సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ఆత్మగౌరవం, సాంస్కృతిక పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామనే దృఢ విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే జాగృతి ప్రధాన ధ్యేయమని కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలనే సత్సంకల్పంతో 2006లో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతిక రూపాన్ని అందించడంలో జాగృతి అగ్రగామిగా నిలిచిందని, మన ప్రాంత ప్రత్యేకతలను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు నిరంతరం శ్రమించిందని వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని, కొత్త నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతమవుతుందనే పూర్తి ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలకే పరిమితమైన అపురూపమైన బతుకమ్మ పండుగను నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో జాగృతి చేసిన కృషి చరిత్రాత్మకమని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా మహిళలను పెద్ద ఎత్తున సంఘటితం చేసి, తెలంగాణ ఉద్యమంలో వారిని క్రియాశీల భాగస్వామ్యులను చేసిన ఘనత ఈ సంస్థకే దక్కుతుందని కొనియాడారు. కేవలం రాజకీయ, ఉద్యమ వేదికగానే కాకుండా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ సంస్థ నిరంతరం కృషి చేసిందని వివరించారు. రాబోయే రోజుల్లోనూ ప్రజా సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణే లక్ష్యంగా జాగృతి తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనుందని చెప్పారు.

తెలంగాణ జాగృతి స్థాపించిన నాటి నుంచి సంస్థ చేపట్టిన వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో మాధవి చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం తీసుకురావడంలో, ముఖ్యంగా పల్లె పల్లెనా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి మహిళలను ఉద్యమబాట పట్టించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గతంలో జాగృతి తరఫున వివిధ స్థాయిల్లో, ముఖ్యంగా మహిళా విభాగాలు, వివిధ జిల్లాల కోఆర్డినేషన్‌లలో నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన ఆమెను తాజాగా అధ్యక్షురాలిగా ప్రకటించారు.