కేంద్రం కీలక హెచ్చరిక.
* నల్ల సముద్రంలో ఉద్యోగాలపై జాగ్రత్తలు సూచించిన విదేశాంగ శాఖ.
ఢిల్లీ, మహా.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నల్ల సముద్ర ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. భద్రతా పరిస్థితులు అత్యంత అస్థిరంగా ఉన్నందున, ఆ ప్రాంతంలో ప్రయాణించే లేదా పనిచేసే వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలు స్వీకరించే ముందు అన్ని రకాల ప్రమాదాలను సమగ్రంగా అంచనా వేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. క్షిపణులు, డ్రోన్ల దాడుల ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
విదేశాంగ శాఖ విడుదల చేసిన అడ్వైజరీలో, నల్ల సముద్రం, దానిని ఆనుకుని ఉన్న సముద్ర జలాల్లో ప్రస్తుతం యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు క్షిపణి, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయని తెలిపింది. అలాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు స్వీకరించే ముందు నౌక ప్రయాణించే మార్గం, వెళ్లే ఓడరేవులు, భద్రతా ఏర్పాట్లు, బీమా సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థల గురించి పూర్తిస్థాయి సమాచారం సేకరించాలని సూచించింది.
ఉద్యోగంలో చేరే ముందు సంబంధిత నౌకా యజమానులు, నియామక సంస్థల నుంచి సమగ్ర వివరాలు పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగ నిబంధనలు అంతర్జాతీయ సముద్ర భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు, సురక్షిత తరలింపు, స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు, బీమా, నష్టపరిహారం వంటి అంశాలపై స్పష్టత తీసుకోవాలని సూచించింది.
ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడంతో పాటు వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. సముద్ర పరిపాలన డైరెక్టరేట్ జనరల్, భారత ప్రభుత్వ సంబంధిత శాఖలు, నౌకా నిర్వాహకులు, సముద్ర భద్రతా సంస్థలు జారీ చేసే సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని తెలిపింది. 2026 ఏప్రిల్ నుంచి యుద్ధ ప్రభావిత సముద్ర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ ఘటనల్లో ఇప్పటికే ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవులో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ (MV AGN Ragnar)’ అనే వాణిజ్య నౌకపై జూలై 25న జరిగిన దాడిలో నలుగురు భారతీయులు చిక్కుకున్న ఘటన ఆందోళన కలిగించింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం నిరంతరం నిఘా ఉంచిందని, ఉక్రెయిన్ అధికారులు, సంబంధిత సముద్ర భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. గల్లంతైన ఇద్దరు భారతీయులను సురక్షితంగా గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే భారతీయ నావికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం మరోసారి విజ్ఞప్తి చేసింది.






