- గాయపడ్డ సీఐతో పాటు ఇద్దరికి గాయాలు
- ఛేజ్ చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై నిఘా పెట్టిన పోలీసులపై ఓ నిందితుడు కారుతో దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు భావిస్తున్న యువకుడు తనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వాహనం ఎక్కించడంతో హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఇన్స్పెక్టర్తో పాటు కానిస్టేబుల్‌కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అబిడ్స్‌లో నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి బెలెనో కారులో వచ్చిన సైఫ్‌కు మరో వ్యక్తి అనుమానాస్పద ప్యాకెట్ అందజేశాడు. వెంటనే పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న సైఫ్‌ను బయటకు రావాలని ఆదేశించారు. అయితే కారు ఆపుతున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్‌లో వేగంగా నడిపి పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి కారు వెళ్లడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వైద్యుల పరీక్షల్లో అతడి కాలు విరిగినట్లు నిర్ధారణ కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటన తర్వాత పరారయ్యేందుకు ప్రయత్నించిన సైఫ్‌ను పోలీసులు వెంటాడి అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో కారుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, ప్యాకెట్లోని పదార్థం, ఘటనకు సంబంధించిన ఇతర కోణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.







