- ప్రజాస్వామ్యంలో ప్రజలు భయపడాల్సిన పని లేదు
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
ముంబై, మహా : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘మేం విజయం సాధించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చింది, వాటి జోలికి రాకండి’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తలొగ్గకుండా నిలబడితే ఎవరిచేతనైనా రాజీనామా చేయించవచ్చునన్న విషయం ప్రధాన్ రాజీనామా ద్వారా రుజువైందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా, తనకు టైఫాయిడ్ వచ్చినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని, దానికి చికిత్స పొందుతున్నట్టు దీప్కే ప్రకటించారు.
తాము నిర్వహించిన ఉద్యమ లక్ష్యం నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా తమ ఉద్యమంపై వ్యతిరేక ప్రచారం చేసిన ప్రభుత్వ అనుకూల మీడియాపై మండిపడ్డారు.
‘మాది తప్పుడు ఉద్యమమంటూ ప్రచారం చేసిన గోదీ మీడియా ఇప్పుడు ఎక్కడికి పోయింది.? విద్యార్థుల ఐక్యత కారణంగానే ఈ ఉద్యమం విజయవంతమైంది’ అని పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో ఉన్న యువత, విద్యార్థులు, మద్దతుదారులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తూ వేడుకలు ప్రారంభించారు.
ఇది ప్రజాస్వామ్య విజయం : వాంగ్ చుక్
మంత్రి రాజీనామాపై పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్ స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.. నేరుగా వీధుల నుంచే.. ఇది శాంతి, సహనం, పట్టుదల విజయం’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యమానికి నేతృత్వం వహించిన సీజేపీ, ఆందోళనలో పాల్గొన్న జెన్ జీని అభినందించారు. భయాన్ని వీడి దేశంలోని ప్రతి మూల నుంచి వచ్చి ఆందోళనలో పాల్గొన్నందుకు ఆయన దేశ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.






