Mahaa Daily Exclusive

  మతం మారితే ఎస్సీ హోదా రద్దు….

Share

  • మతం మారితే ఎస్సీ హోదా రద్దు
  • ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన అథ్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, మహా : మత మార్పిడి పొందిన వ్యక్తుల రాజ్యాంగబద్ధమైన షెడ్యూల్డ్ కులాల హోదాకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను వదిలి ఇతర మతాల్లోకి ప్రత్యేకించి క్రైస్తవం లేదా ఇస్లాం మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను, దాని ఆధారంగా పొందే రిజర్వేషన్ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో మార్చి 2026లో తామిచ్చిన చారిత్రాత్మక తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

గతంలో ఏపీ హైకోర్టు తీర్పు

గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ పరిధిలోకి రారని, రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్స్ (ఆర్డర్) 1950 ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు , బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు చట్టబద్ధమైనదేనని సమర్థిస్తూ సుప్రీంకోర్టు మార్చి 2026 లోనే కీలక తీర్పు వెలువరించగా, తాజాగా ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కూడా ధర్మాసనం కొట్టివేయడంతో ఈ అంశంపై న్యాయపరమైన తుది ముగింపు లభించినట్లయింది.

రివ్యూకు సుప్రీంకోర్టు నిరాకరణ

రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టమైన న్యాయ సూత్రాలను వెల్లడించింది. మత మార్పిడి ద్వారా ఇతర మతాలను స్వీకరించినప్పుడు, ఆయా మతాల్లో కుల వ్యవస్థ లేదా అస్పృశ్యత వంటి సామాజిక వివక్షలు ఉండవనే ప్రాతిపదికన రాజ్యాంగం ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రక్షణలు కల్పించిందని వ్యాఖ్యానించింది. అందువల్ల, ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇతర మతంలోకి మారిన మరుక్షణమే ఆ వ్యక్తి రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎలాంటి సాకులు చెప్పి రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించడం సాధ్యపడదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అధికారికంగా ఘర్ వాపసీ జరిగినప్పుడు మళ్లీ ఎస్సీ హోదా

అదే సమయంలో, ‘ఘర్ వాపసీ’ లేదా పునరాగమనం అంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం కీలక స్పష్టతనిచ్చింది. ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తిరిగి తమ మూల మతాలైన హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి అధికారికంగా పునరాగమనం చేసినప్పుడు మాత్రమే.. ఆయా సామాజిక వర్గాల ఆమోదం మేరకు వారి ఎస్సీ హోదా పునరుద్ధరించబడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం పేర్లను మార్చుకోవడం లేదా కాగితాల మీద ఆధారాలను చూపించడం వల్ల ఎస్సీ సర్టిఫికేట్లు చెల్లుబాటు కాబోవని హెచ్చరించింది.