Mahaa Daily Exclusive

  రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లు….

Share

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లు.
* సెనెట్ ఆమోదం.. భారత్, చైనాపై 100 శాతం టారిఫ్‌లకు అవకాశం.
ఢిల్లీ, మహా.

రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి భారీగా ముడి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక వనరులు అందకుండా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని అమెరికా పేర్కొంది.

రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ సంయుక్తంగా రూపొందించిన ఈ బిల్లుకు సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో 86–12 ఓట్లతో భారీ మద్దతు లభించింది. అయితే ఇది ఇంకా చట్టంగా మారలేదు. సెనెట్‌లో మిగిలిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం అమెరికా అధ్యక్షుడు సంతకం చేస్తేనే ఇది అమల్లోకి రానుంది.

ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు కొనసాగించే ప్రధాన దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సుంకాలను ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్న తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడి విచక్షణాధికారంలోనే ఉంటుంది.

రష్యా చమురు, సహజ వాయువు ఎగుమతుల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చట్టసభ్యులు భావిస్తున్నారు. రష్యాతో పాటు ఇరాన్‌పై అదనపు ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అవసరమైన నిబంధనలను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే ప్రపంచ ఇంధన వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పాటు, రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.