Mahaa Daily Exclusive

  మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే..  ఉక్రెయిన్ రాయబారి సంచలన వ్యాఖ్య..

Share

  • రష్యా మిత్రపక్షాలు పాల్గొనడం ఇదే సూచిస్తున్నాయన్న అధికారి జలుజ్నీ
  • ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
  • ఉక్రెయిన్‌కు అనేక మంది శత్రువులు ఉన్నారన్న జలుజ్నీ

 

మహా-

ఉక్రెయిన్ మాజీ మిలటరీ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిటన్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ జలుజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నానని జలుజ్నీ వ్యాఖ్యానించారు. తాజా సంక్షోభంలో రష్యా మిత్రపక్షాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో ప్రావ్దా యూపీ100 అవార్డ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు.

ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడుతున్నారని, ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు.

తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఇక్కడితో ఆపడం సాధ్యమేనని… కానీ కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు అనేకమంది శత్రువులు ఉన్నట్లు తెలిపారు.