Mahaa Daily Exclusive

  ప్రక్షాళనా..? విస్తరణా..? మంత్రులపై హై కమాండ్ సర్వే..

Share

  • సంచలనంగా మారిన ఢిల్లీ రిపోర్ట్
  • నలుగురిపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తి
  • నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
  • విస్తరణ అంశాలు.. నామినేటెడ్ పదవులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • పనితీరు బాగా లేని మంత్రులకు.. డెడ్ లైన్ విధించే యోచన
  • బిఆర్ఎస్ ఎల్పీ విలీనమైతే రెండు బెర్త్ లు?
  • తాత్కాలిక విస్తరణకు ఛాన్స్
  • లేకుంటే ఉగాదికి పూర్తి ప్రక్షాళన

 

హైదరాబాద్, మహా

 

తెలంగాణలోని మంత్రులపై కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికపుడు నివేదికలు తెప్పించుకుంటోంది. ప్రధాన శాఖలు అప్పగించినా.. కొందరు మంత్రుల పనితీరు పేలవంగా ఉందని, గతంలో మంత్రులుగా పనిచేసిన కొందరు కూడా అంచనాలకు భిన్నంగా అప్రతిష్ట తెచ్చుకుంటున్నారన్న ఫిర్యాదులు కాంగ్రెస్ హైకమాండ్ కు అందాయి. ముఖ్యమంత్రితో కలిసి ప్రస్తుతం 11మంది మంత్రులు ఉండగా, ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆరుమాసాలు పూర్తిచేసుకున్న నాటి నుండీ అధిష్టానం వరుసగా నివేదికలు తెప్పించుకుంటుండగా, పదవుల విషయంలో హైకమాండ్ దే తుదినిర్ణయమని సీఎం మొదటినుండీ చెబుతున్నారు. ముగ్గురు మంత్రులున్న ఓ జిల్లాలో ఒక మంత్రికి గండం పొంచి ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ శాఖ పరిధిలో ప్రభుత్వం శక్తికి మించి డబ్బులు ఖర్చుచేసినా.. శాఖలో అనుకున్నంత పేరు రాకపోగా, నిర్లక్ష్యపు పనితీరు కారణంగా ప్రభుత్వానికి నష్టం జరిగిందన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉంది. ఒకరిద్దరు మంత్రులు తమ శాఖల కంటే ఇతరత్రా వ్యవహారాలకు అధిక సమయం కేటాయిస్తున్నారని, శాఖల్లోని కొందరు వ్యక్తులపై ఆరోపణలున్నా పెంచి పోషిస్తున్నారన్న ఫిర్యాదులు హైకమాండ్ కు అందాయి. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే ప్రస్తుతం ఏకంగా ఏడుగురు మంత్రులు ఉండగా.. వీరిలో ముగ్గురిపై అధిష్టానం సంతృప్తిగా లేదన్న సమాచారం వినబడుతోంది. ప్రక్షాళన జరిగితే ఇద్దరికి మాత్రం కొనసాగింపు కష్టమన్న అభిప్రాయం ఉంది. హైదరాబాద్ ను ఆనుకుని ఉండే మరో జిల్లాలో.. కీలక శాఖ అప్పగించినా, ఆశించిన పనితీరు కనబడడం లేదని, పనితీరు మెరుగుపడాలన్న అభిప్రాయం అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ కు అందిన రిపోర్టుల ఆధారంగా.. పలువురికి హెచ్చరికలు లేదా సూచనలు చేయనున్నట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండగా, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ అంశాలపై చర్చ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికిపుడు పూర్తిస్థాయి విస్తరణ జరగడం వల్ల పార్టీకి కలిగే లాభమేంటి? నష్టాలేంటి? త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 30 నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆమోదం తీసుకోబోతున్నారా? ఇలాంటి వన్నింటిపై స్పష్టతరావాలని నేతలు కోరుకుంటున్నారు. డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని లేదా ప్రియాంకగాంధీని సీఎం ఆహ్వానించే అవకాశాలున్నాయి.

 

బిఆర్ఎస్ కు రెండు బెర్త్ లు?

 

బిఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బిఆర్ఎస్ నుండి వచ్చే కనీసం ఇద్దరికి కేబినెట్ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి సూచనలు అందినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ బలంగా ఉండగా, ఎమ్మెల్యేల చేరికల ద్వారా తొలిదశలో కేసీఆర్ అనుసరించిన ఫార్ములానే అనుసరించాలన్న ప్రతిపాదనలు సీఎంకు అందినట్లు తెలుస్తోంది. అయితే బిఆర్ఎస్ నుండి వచ్చే వారికి పదవులు ఇవ్వమని గతంలో ప్రకటించిన సీఎం రేవంత్ తాజా ప్రతిపాదనలు, రాజకీయ అనివార్యతల నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విలీన ప్రయత్నాలు కొనసాగించాలనుకుంటే, బెర్త్ లు ఇవ్వాలనుకుంటే డిసెంబర్ లో పూర్తిస్థాయి విస్తరణ లేదా ప్రక్షాళన ఉండకపోవొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

 

 

అదిగో విస్తరణ

 

అదిగో విస్తరణ.. ఇదిగో పదవులు అంటూ మీడియాలో చాలా కాలంగా శాఖలు, పదవులు పంచేస్తున్నారు. ఇపుడు కూడా అదే రిపీట్ అవుతుందా.. ఊహాగానాలు నిజమవుతాయా చూడాలి. ఇప్పటికే ఉన్న కేబినెట్‌లో.. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో.. ఆ ప్రాంతాల నాయకులకే ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఓ స్థానాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరుల పేర్లు వినిపిస్తుండగా.. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్‌నగర్ నుంచి వాకిటి శ్రీహరి, ఎస్టీ కోటాలో బాలునాయక్ , రామచంద్రనాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు ఖాళీలలో మూడు లేదా నాలుగు ఖాళీలు భర్తీ చేస్తారా? మొత్తం భర్తీచేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటుచేస్తే మాత్రం మరో సాహసం చేసినట్లేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.

……………….