Mahaa Daily Exclusive

  మణిపూర్‌లో మంటలెందుకు..? 

Share

మహా: ప్రకృతి అందాలకు రమణీయం ఆ ప్రాంతం. చుట్టూ పచ్చని వాతావరణం, కొండలు, లోయలు కనిపిస్తుంటాయి. దీంతో ఆ ప్రాంతం యావత్ భారత దేశానికి ఓ మణిహారంలా ఉంటుంది. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లామంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనే ఆతృత కలుగుతుంది. అక్కడ వాతావరణమే కాదు, అక్కడి సంప్రదాయాలు కూడా చూడ ముచ్చటగా ఉంటాయి. 22,347 స్వేర్ కిలో మీటర్స్ లో ఆ ప్రాంతమంటుంది. కానీ, యావత్ దేశాన్ని తన అందాలతో ఆకర్షిస్తుంది. అలాంటి సుందరమైన ప్రాంతమే మణిపూర్. మణిపూర్ దేశంలోని చిన్న రాష్ట్రాల్లో ఒకటి. 30 లక్షలకు పైగా ఇక్కడ జనాలు ఉంటారు. పలు రకాల గిరిజనులు ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ లోయల అందాల పెట్టింది పేరు. అటువంటి ఈ ప్రాంతంలో గత ఏడాదిన్నర నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత వాతావరణంగా పేరున్న ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఆందోళనల వల్ల చాలామంది మృత్యువాతపడ్డారు. ఎంతోమంది గాయపడ్డారు. మానవత్వం తలదించుకునే ఘటనలు కూడా సైతం ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఆస్థినష్టం కూడా భారీగా జరిగింది. చాలామంది ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ప్రజాప్రతినిధుల ఇండ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. మొత్తంగా అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. దీంతో యావత్ దేశం మణిపూర్ వైపు చూస్తుంది.

 

సరిగ్గా గత ఏడాది మేలో మణిపూర్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కాస్త ఉద్రిక్త వాతావరణంగా మారింది. అక్కడ ప్రధానంగా కుకీలు, మైతేయ్ లు అనే రెండు తెగలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. నాగ, కుకీ, జోమీ, ఆదివాసీలతోపాటు 34 ఆదివాసీ తెగలు – మైతేయ్ ల మధ్య అగ్గి రాజేసుకుంది. లోయ ప్రాంతాల్లో నివాసముండే తమను కూడా ఎస్టీల్లో చేర్చి, తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మైతేయ్ లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తమకు పర్వత ప్రాంతాల్లో కూడా భూములు కొనే అవకాశం కలుగుతుందని, వీటితోపాటు మిగతా విషయాల్లో కూడా న్యాయం జరుగుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు. 1948 నుంచి కూడా తమను ఎస్టీలుగా గుర్తించారని, ఆ మేరకు రిజర్వేషన్ ఉండేదని వారు గుర్తుచేస్తున్నారు. ఆ హోదాను ఇప్పుడు కూడా పునరుద్ధరించాలంటూ మైతేయ్ తెగ కోరుతుంది. తాము కోరుకుంటున్నది కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే కాదని, తమ సంస్కృతి, భాష, సంప్రదాయాలు, భూమిని కాపాడుకోవడం కోసమే తమను ఎస్టీలుగా గుర్తించాలని వారు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

మైతేయ్ ల వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కుకీలు, నాగతోపాటు మిగతా తెగలు. రాష్ట్రంలో మెజారిటీగా, రాజకీయంగా మైతేయ్ లదే పైచేయి ఉన్నదని, వారు ఇప్పటికే ఎస్సీ, ఓబీసీ హోదాలను అనుభవిస్తున్నారని, అందువల్ల వారికి ఎస్టీ హోదా ఇవ్వడం సరికాదంటూ కుకీ, నాగ తెగలు చెబుతూ వస్తున్నాయి. వారిని ఎస్టీలో చేర్చి, రిజర్వేషన్ కల్పిస్తే పర్వత ప్రాంతాల్లో నివాసముండే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి ఆదివాసీ విద్యార్థి సంఘాలు గత ఏడాదిలో మే నెలలో ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఆరోజు నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దాడులు, అఖరకు ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఆఫీసులు, దేవాలయాలు, చర్చిలను ధ్వంసం చేసి వాటికి నిప్పుపెడుతున్నారు. ఈ ఆందోళనలలో చాలామంది ప్రజలు కన్నుమూశారు. భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది. ఇవేకాకుండా ఏ చిన్న సంఘటనా జరిగినా అది పెద్దదిగా మారుతుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఇవేకాదు.. మానవత్వం తలదించుకునే పలు సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలా వరుస ఆందోళనలతో సంవత్సన్నర నుంచి అక్కడి ప్రభుత్వానికి, కేంద్రానికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ప్రత్యేక బలగాలతో పహారా కాస్తున్నా కూడా అక్కడి ఆందోళనలు ఆగడంలేదు. తాజాగా కూడా మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధులు ఇళ్లపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఈ సెగ ప్రజాప్రతినిధులకే కాదు.. సీఎం వరకు వెళ్లింది. ఆయన ఇంటిని సైతం ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో వరుస సంప్రదింపులు జరుపుతుంది. అదనపు బలగాలను అక్కడి పంపింది. అంతేకాదు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోలేదని, ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని, జమ్మూలో విధించిన మాదిరిగా రాష్ట్రపతి పాలనను విధించి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలనే ఆలోచనలో కేంద్రం వ్యూహాలు రచిస్తున్నదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

అయితే, ఆందోళనల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతపెద్ద స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నా, అమాయకులు బలవుతున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో సైతం ఈ అంశంపై కేంద్రాన్ని బోనులో నిలబెట్టి నిలదీశారు. దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నలు వెల్లువెత్తాయి. ప్రధాని మౌనం వీడాలంటూ నినదించారు. ఇటు ప్రతిపక్షాలపై ఎన్డీయే నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాలను ఇరుకున పెట్టించేందుకు, మణిపూర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు సరిగ్గా పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలోనే ఇలాంటి ఆందోళనలకు ఎవరో కావాలనే పురిగొలుపుతున్నారని పేర్కొంటున్నారు. మణిపూర్ కు గతంలో లేని, రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. మణిపూర్ లో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటుందని వారు పేర్కొంటున్నారు. చూడాలి మరి మణిపూర్ ఆందోళనలకు ఎప్పుడు తెర పడుతుందనేది.