- -పెరుగుతున్న చలి తీవ్రత
- -చాయ్ కోసం ఎగబడుతున్న జనం
- -టీ షాపులకు పెరుగుతున్న గిరాకీ
హైదరాబాద్, మహా: ప్రస్తుతం శీతాకాలం కావడంతో రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. సుమారుగా 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదేవిధంగా చలి పంజా విసురుతుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం సమయంలో 7 గంటలకు కూడా చలి తీవ్రత, దీనితోపాటు పొగమంచు అలుముకుంటుంది. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఈ చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తువులను వాడుతున్నారు. పలువురు తమ ప్రయాణాలను, పనులను చలి లేని సమయంలోనే చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎటువంటి ప్రత్యామ్నాయం లేనివారు ఉన్ని దుస్తువులు ధరించి చలి నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు. వీటితోపాటు ‘టీ (చాయ్)’ని తాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాధారణంగా ఇండియన్స్ చాయ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రోజుకు కనీసం రెండుసార్లు అయినా తాగుతుంటారు. ఇంకొందరైతే కనీసం 5 సార్లు కూడా తాగేందుకు వెనుకాడారు. మరికొందరైతే ఏకంగా చాయ్ కు అడిక్ట్ అవుతుంటారు. అయితే, ప్రస్తుతం చలి కాలం కావడంతో చాయ్ తాగేవారి సంఖ్య పెరిగిందంటా. ఉదయం సమయంలో ఎక్కడ టీ షాపును చూసినా జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. తెల్లతెల్లవారుజామున టీ తాగుతూ వెచ్చదనాన్ని పొందుతున్నారు. వెచ్చదనమే కాకుండా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది టీ తాగితే. ఎక్కువగా గిరాకీ ఉండడంతో టీ షాపు వాళ్లు కూడా ముందుగానే ఉదయం 4 గంటల నుంచే షాపుల తెరుస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే, ఉదయం 6 లేదా 7 గంటలకు టీ షాపుల వద్ద జనాలు భారీగా కనిపిస్తుంటారు. కానీ, ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండడంతో ఉదయం 4 గంటల నుంచే షాపులు, హోటల్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. సాధారణ రోజుల్లో టీని ఉదయం, సాయంత్రం తాగుతుంటారు. కొందరు ఉదయం మాత్రమే తాగుతుంటారు. ఆఫీసుల్లో కూడా తాగుతుంటారు. చలి గాలులు వీస్తుండడంతో టీ తాగేవారి సంఖ్య పెరిగిందంటా. ఇంట్లోవాళ్లు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఒక్కోసారి రాత్రి వేళ్లల్లో కూడా టీని తాగుతున్నారంటా. కొంతమంది మందుబాబులు కూడా మద్యాని కన్నా టీ తాగడానికే ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తున్నారంటా. నగర ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఎక్కడ చూసినా టీ షాపులు, హోటల్స్ ముందు జాతర మాదిరిగానే జనాలు కనిపిస్తున్నారు. రోడ్లపై ఉండే చిన్న చిన్న టీ సెంటర్ల వద్ద భారీగా జనాలు కనిపిస్తున్నారు. పండుగ రోజుల్లో కనిపించే సందడి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. తెల్లతెల్లవారుజామున ఉండే మంచుపొగలు, ప్రశాంత వాతావరణం, వీటి మధ్యలో ద్వీపఖండాల్లా టీ షాపులు, వాటి చుట్టూ నీళ్ల వలే జనాలు కనిపిస్తున్నారు. సాయంత్రం సమయంలో కూడా అదేవిధంగా కనిపిస్తుంది. గతంలో కంటే ఈసారి తమకు గిరాకీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు టీ షాపుల ఓనర్లు. టీ తాగేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతున్నారు.
టీ తాగితే జోష్
చాయ్ తాగేవారిని పలువురిని పలకరిస్తే తమకు టీ తాగితే చలితోపాటు మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఉదయం సమయంలో టీ తాగగానే నుంచి కొంత వెచ్చదనం కలుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజు టీ తాగడం తమకు అలవాటేనని, అయితే, ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండడంతో ఎక్కువసార్లు టీ తాగుతున్నామని చెబుతున్నారు.
సలహా..
ఎక్కువ శాతం మంది టీ తాగుతుంటారు. అందులో కొంతమంది టీకి పూర్తిగా అడిక్ట్ అవుతారు. రోజుకు ఒక రెండు సార్లు తాగితే పర్వాలేదు. కానీ, కొందరు మాత్రం ఏకంగా రోజుకు 5 సార్లు, ఇంకొంతమందైతే ఇంకా ఎక్కువసార్లు తాగుతాతుంటారు. అయితే, ఇలా టీని ఎక్కువసార్లు కాకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేనియెడల పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని వారు సూచిస్తున్నారు.