మహా: ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఆధ్వర్యంలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సాధించింది. 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఘోర పరాజయం పాలైన మహావికాస్ అఘాడి(ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్)కు కేవలం 49 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇటు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన అధ్యక్ష పదవికి సోమవారం రాజీనామా చేశారంటూ వార్తాలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తానేమీ రాజీనామా చేయలేదన్నారు. ఇటు మహా వికాస్ అఘాడి కూడా చెక్కుచెదరకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం 103 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా పార్టీ పరాజయాన్ని చవిచూడలేదు. ఆ 16 మంది గెలిచినవారిలో నానా పటోలే కూడా ఉన్నారు. సకోలీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి 208 ఓట్ల తేడాతో అతికష్టం మీద గట్టెక్కారు. 2021 నుంచి నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.