”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేసేందుకు,ప్రభుత్వాన్ని అస్తిర పరచడానికి బిఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక పథకాన్ని రచించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో అయిదు రోజుల కిందట ఆరోపించారు.కొడంగల్ నియోజకవర్గం ‘లగచర్ల’లో ఫార్మా సంస్థల కోసం ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా భారీ కుట్ర జరిగిందని,ఈ కుట్ర అమలుకు గాను 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని,వీటి వెనుక కేసీఆర్ ప్రమేయం ఉండవచ్చున”ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమానం వ్యక్తం చేశారు.లగచర్ల కేసు విచారణ సందర్భంగా,హైకోర్టులో వాదోపవాదాల సమయంలో కేసీఆర్ ప్రస్తావన వచ్చింది.లగచర్ల హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏ2 గా ఉన్నారు.నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరున్నది.తాజాగా కేసీఆర్ పేరు కూడా ప్రచారంలోకి రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ”మూడు నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది.లేదా నాలుగు నెలల్లో కూలిపోతుంది.అదిగో అసంతృప్తి.,ఇదిగో అసమ్మతి.అదిగో ప్రజల్లో తిరుగుబాటు.ఇదిగో కల్లోలం.అదిగో భీభత్సం.కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయనను దించేస్తారు”.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కాకుండానే బిఆర్ఎస్,బీజేపీ నాయకుల నోటి నుంచి శర పరంపరగా వస్తున్న మాటలు.తాను తొక్కుకుంటూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని,కానీ ఆయన పదవిలోకి వచ్చేందుకు తొక్కింది కాంగ్రెస్ నాయకులనే అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు అంటున్నారు.అసలు రేవంత్ ప్రభుత్వం ఎలా కూలిపోగలదో,ఎందుకు కూలిపోగలదో,అర్జెంటుగా కేసీఆర్ సీఎం కుర్చీలో ఎట్లా కూర్చోగలరో ఎవరికీ అంతుచిక్కదు. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకేదాకా రేవంత్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. ‘కేటీఆర్ తో కలిసి తిరుగుతున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు’ అని పిసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గత శుక్రవారం ఒక బాంబు పేల్చారు.పీసీసీ అధ్యక్షుని ప్రకటన ఎనుక ఏదో భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.కొంతమంది ఈ ప్రకటనలను మైండ్ గేమ్ గా కొట్టి పారవేస్తుండవచ్చును.కానీ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యుల ‘అనర్హత’ కేసు మలుపులు తిరుగుతోంది.బిఆర్ఎస్ ఆశించిన ఊరట హైకోర్టులో దొరకలేదు.ఇక సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.అయితే కోర్టులు,అసెంబ్లీ స్పీకర్ కోర్టులోకి బంతిని విసిరేసే అవకాశాలున్నవి.కనుక ఈ అనర్హత కేసులు మళ్ళీ ఎన్నికల దాకా కొలిక్కి రావచ్చు,రాకపోవచ్చు.అంతిమంగా స్పీకర్ నిర్ణయమే తుది తీర్పు కానుంది. ‘తొక్కుకుంటూ’ రావడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.తొక్కడం,తొక్కుకుంటూ రావడం అంటే చాలా అర్ధాలున్నవి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో దీనర్ధం,తనపైన,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన,ప్రజాస్వామిక హక్కులపైన అణచివేత,నిర్బంధాలు,తప్పుడు కేసులపైన ‘ధిక్కార స్వరం’తో తొక్కడమని అర్ధం.బిఆర్ఎస్ నాయకులను తొక్కుకుంటూ రావడం.’తొక్కుకుంటూ రాకపోతే బిఆర్ఎస్ వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి పారవేయడం సాధ్యమేనా’?కేసీఆర్ వంటి దిగ్గజ నాయకుడ్ని అధికారం నుంచి అమాంతం ఎత్తి కిందకు తోసి పారవేయడం జరిగే పనేనా?అర్ధబలం,అంగబలం,రాజకీయ టక్కు టమారాల్లో ఆరితేరిన నైపుణ్యం పుష్కలంగా ఉన్న భారత రాష్ట్ర సమితిని అసలు ఎదుర్కోవడమే ఒక సాహసం.కేసీఆర్ ను ఎదుర్కుని నిలబడడం,నిలబడి కలబడడం,విజయం సాధించడం అంటే ఇక ఎంతటి నేర్పరితనం,ఎంతటి సమయస్ఫూర్తి ఉండాలో సులభంగా ఊహించవచ్చును. అలాగే, తొక్కాలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్ రెడ్డి.తొక్కతీసే రకం. దాదాపు నాలుగేండ్లుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇది తెలుస్తూనే ఉన్నది.రేవంత్ సక్సెస్ మంత్రం అదే.తన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు కమ్ముకున్నా,ఉప్పెనలు,తుపానులు ముంచెత్తినా వాటి నుంచి బయటపడి ఆకాశమంత ఎత్తునకు సులభంగా ఆయన ఎగరగలడు.కాగా 2018 నుంచే తెలంగాణ రాజకీయాల్లో ‘కేసీఆర్,రేవంత్ మధ్య యుద్ధం ‘వంటి వాతావరణాన్నే తెలంగాణ సమాజం చూస్తోంది.ఆ వాతావరణాన్ని చాలామంది అర్ధం చేసుకోలేదు.గ్రహించలేదు. కొడంగల్ లో రేవంత్ ను ఓడిస్తే ఆయన భయపడిపోయి ఇక ఈ యుద్ధం నుంచి పారిపోతాడని బిఆర్ఎస్ నాయకుల్లో ఒక భ్రమ ఉండేది.కేసీఆర్ వ్యూహరచన,హరీశ్ రావు మేనేజ్ మెంటు స్కిల్స్ కారణంగా రేవంత్ ఓటమిపాలయ్యారు.అసెంబ్లీకి ఓడిపోయినా బాధపడలేదు.కుంగిపోలేదు.మనోవ్యధతో మంచం పట్టలేదు.ఇంటికే పరిమితం కాలేదు.మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు.తనను కింద పడేశామనుకున్న ప్రత్యర్థుల్ని చూసి రేవంత్ నవ్వుకున్నాడు.మళ్ళీ పైకి లేచి కేసీఆర్ పై యుద్ధానికి సిద్ధమయ్యారు.తనను రాజకీయంగా ఎంత అణచివేయాలని కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రయత్నించినా మళ్ళీ,మళ్ళీ పైకి లేవడంలోనే ఆయన గెలుపు సూత్రముంది. తెలంగాణలో ‘కాంగ్రెస్ పార్టీ పనైపోయింది’ అన్నసీన్ నుంచి,కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించి,తన నాయకత్వ ప్రతిభను మేళవించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేసి ఉండకపోతే అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కేది కాదు.రేవంత్‌రెడ్డి దూకుడుతోనే కేసీఆర్ పార్టీ చిత్తయిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలేమీ లేవు.అయితే క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి ఖాతాలో వేస్తే పార్టీ సీనియర్లకు ఆగ్రహం వస్తుండవచ్చు.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా తలపడి కెసీఆర్ ను ఫార్మ్ హౌజ్ కు పంపించారు. “గుడి లేని ఊరు లేదు,కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు.మిమ్మల్ని కాదనుకొని చేజేతులా తినే కూటిలో మన్ను పోసుకున్నామని తెలంగాణ సమాజం తల్లడిల్లుతున్నది.నోటికాడి బుక్కను నేలపాలు చేసుకున్నామని పశ్ఛతాపపడుతోంది.ఇప్పుడు సారే రావాలి.కారే గెలవాలని తెలంగాణ కలవరిస్తున్నది” అని బిఆర్ఎస్ ‘సుపారీ’ మీడియాలో ఒక పోస్టును ఇటీవల చూశాను. ఇటువంటి పోస్టులు వేలు,లక్షల సంఖ్యలో బిఆర్ఎస్ మీడియాలో ‘కుమ్మి పారేస్తున్నారు’.తమ అభిప్రాయమే,ప్రజల అభిప్రాయంగా మలచడానికి,తమ మాటే ప్రజల మాటగా,తమ నిర్ణయమే ప్రజల నిర్ణయంగా ‘ప్రాపగండ’ చేయడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు.’నోటి కాడి బుక్కను నేల పాలు చేసుకున్నామని, ప్రజలు పశ్చాత్తాపానికి గురవుతున్నట్టు’ గా చేస్తున్న ప్రచారం విషప్రచారమే! అంటే కేసీఆర్ రావాలని,ఆయన అత్యవసరంగా సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నట్టు భావించాలి. ”మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.లెఖ్ఖ ప్రకారం మరో 16 మంది ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ నుంచి వెలుపలికి రావాలి.కానీ వాళ్ళకు కేసీఆర్ ఎలా ‘బ్రేకు’ వేశారో అంచనా వేయడం కష్టం కాదు.రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ‘ముప్పు’ రాకుండా ఉండాలంటే రాజకీయ సుస్థిరత అవసరం.కాంగ్రెస్ పార్టీ వైపు 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఇప్పటికిప్పుడు ప్రమాదమేమీ లేకపోయినా,బిఆర్ఎస్ లో ‘చీలిక’ తీసుకు రావలసి ఉన్నది.బిఆర్ఎస్ బలహీనపడడంలోనే,కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరత ఆధారపడి ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.బహుశా మంత్రివర్గ విస్తరణ తర్వాత కనీసం 15 మందికి పైగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందంటూ ఒక ప్రచారం సాగుతున్నది.అదే నిజమైతే బిఆర్ఎస్ పార్టీలో సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చు. కాగా వరంగల్,వేములవాడ సభలు విజయవంతం కావడం రేవంత్ ఇమేజ్ ను పెంచింది.దీన్ని భరించడం బిఆర్ఎస్ కు దుర్భరంగా ఉన్నది.రేవంత్ పై ‘పగ,ప్రతీకారం’ తీర్చుకోవాలన్న కసి బిఆర్ఎస్ లో క్షణ క్షణం పెరిగిపోతోంది. “నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్కవు.నిన్ను పీకి అవతల పారేస్తం.నిన్ను ఢిల్లీకి రానిస్తలేరు.నీకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు”.అని ఎర్రబెల్లి దయాకరరావు ఫైరయ్యారు.ఎర్రబెల్లి,రేవంత్ ల మధ్య పాత ‘లెక్కలున్నవి’.ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కు ఎర్రబెల్లి ఇంఫార్మర్ పనిచేసినట్టు రేవంత్ ఆరోపణ.అందువల్ల ఇద్దరి మధ్య ఆనాటి నుంచే ‘గొడవలున్నాయి. ఇదిలా ఉండగా ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని, నిబంధనల ప్రకారమే చేయాలని ఐఏఎస్ లు నిశ్చయించుకున్నట్టు ఒక ప్రచారానికి బిఆర్ఎస్ ‘సుపారీ మీడియా’ పదునుబెడుతున్నది.నవంబర్ 20 న కొందరు ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమై మౌఖిక ఆదేశాలతో పనిచేయాలని మంత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు చర్చించారట.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన పలు పరిణామాలను,ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో గుర్తుచేశారట.భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తామే అనుభవించాల్సి ఉంటుందని అనుకున్నారట.మూడవసారి కూడా అధికారంలోకి రావడానికి గాను కేసీఆర్,ఆయన బృందం పాల్పడిన ‘చట్ట వ్యతిరేక’ చర్యలు,ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నవి. తాజాగా ఐఏఎస్ అధికారులకు చెందిన ‘సమావేశం’, ‘సుపారీ మీడియా’ కట్టుకథ అని కొందరు ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు.పైగా కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు,కాళేశ్వరం ప్రాజెక్టు,ఫోన్ ట్యాపింగ్ వంటి భాగోతాలల్లో కొందరు సీనియర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు,సీనియర్ ఇంజనీర్లు ‘జైలుకు పోయే అవకాశాలు కొట్టి పారవేయలేమ’ని ఉన్నతాధికారులు అంటున్నారు.ఆనాడు కేసీఆర్,కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో పనులు చక్కబెట్టిన వారే ఇలా సమావేశాలు పెట్టుకొని ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేయడం ఆశ్చర్యం. బిఆర్ఎస్ ‘లబ్దిదారులైన’ కొందరు ఉన్నతాధికారులు ‘కేసీఆర్ ఉప్పు తిన్న విశ్వాసాన్ని’ మరచిపోలేకపోతున్నట్లున్నది.సాధారణంగా అతితక్కువ సందర్భాలలోనే మంత్రులు,సీఎం మౌఖిక ఆదేశాలు ఇస్తారన్నది మనకు తెలుసు.వాటిని అమలు చేయడం చేయకపోవడం అధికారుల పరిమితి, పరిధి,ఆధికారం,విచక్షణను బట్టి ఉంటుంది.ప్రభుత్వంలో ఉన్న వారెవరయినా కేవలం చట్టప్రకారమే నడుచుకున్న,నడుచుకుంటున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు అరుదు.అందుకే మనం దివంగత ‘ప్రజాధికారులు’ యుగంధర్,ఎస్.ఆర్.శంకరన్ వంటి వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం.ఇప్పుడలాంటి వాళ్ళను కాగడా పెట్టి వెతికినా దొరకరు. ‘దీపం ఉండగానే’ ఇల్లు చక్కపెట్టుకున్నవాళ్ళు, యింకా చక్కపెట్టుకుంటున్న వాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో నవీన్ మిట్టల్,అరవింద్ కుమార్,జయేష్ రంజన్,సోమేశ్ కుమార్ వంటి ఉన్నతాధికారుల నుంచి అమేయ కుమార్ దాకా వారి ‘లీలలు’ ఏమిటో ప్రజలు గ్రహించారు.అధికారులలో ‘కేసీఆర్ /కేటీఆర్ భక్తులు’ వేరయా ! అన్నది నిజం.నవంబర్ 22 న కేటీఆర్ ప్రాయోజిత మీడియాగా ఆరోపణలున్న మాధ్యమాల్లో ‘మౌఖిక ఆదేశాలు వినకూడదు’ అని ఐఏఎస్ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇంతే కాదు,కొద్ది రోజుల కిందట ఈ మాధ్యమాలలోనే ‘రేపో మాపో రేవంత్ ప్రభుత్వం మారిపోవచ్చు,కూలిపోవచ్చు,ముఖ్యమంత్రి మారిపోవచ్చు.కనుక ఆచితూచి ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయాలని ఐఏఎస్ లు ఆలోచిస్తున్నట్టు’ ఒక కధనం వండి వార్చారు.రేవంత్ రెడ్డిని ఇప్పట్లో మార్చే అవకాశం లేదని,2028 ఎన్నికల దాకా ఆయనే సీఎంగా ఉంటారని తెలిసిన కొందరు మంత్రులు కూడా ‘పరోక్షంగా’ బిఆర్ఎస్ కు మద్దతు తెలియజేస్తున్నట్టు బిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రచారం ఊపందుకున్నది.ఇదెంత నిజమో తెలియదు.ఇప్పటికే ‘ఈ ప్రభుత్వం పూర్తి కాలం ఉండద’న్న ప్రచారం ప్రజలలో బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతిపక్షం చెమటోడ్చుతోంది. ప్రజల్ని బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందని ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ ఉన్నది.ప్రజలను ‘బ్రెయిన్ వాష్’ చేయడంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు వంటి వారు నిష్ణాతులు.’థాట్ పోలీసింగ్’ లో వారు దిట్ట.’కేసీఆర్ రావలసిందే’ అనే నినాదం క్షేత్రస్థాయిలో మార్మోగేలా బిఆర్ఎస్ నాయకత్వం అనేక తంటాలు పడుతోంది.బీజేపీ,బీఆర్ఎస్ కలిసి రేవంత్ సర్కార్ కూల్చే కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో విస్తృతంగా సాగుతుండడం వెనుక ఆ పార్టీ ప్రమేయం ఉన్నది.కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెళ్లకు మించి ఉండదంటూ ఒకే స్వరంతో బిఆర్ఎస్,బీజేపీ మాట్లాడుతున్నవి. ఎస్.కే.జకీర్, సీనియర్ జర్నలిస్ట్.