Mahaa Daily Exclusive

  డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

Share

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 35 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్‌కు ఆమె అందించారు. బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి ఈ నివేదికను సమర్పించారు.

 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలను అమలు చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు తాత్సారం చేసిందని ఆరోపించారు. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలని ఆకాంక్షించారు.

 

అయినా ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామాగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. కులగణనపై నెల రోజుల్లోనే నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నారు. డెడికేటెడ్ కమిటీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్టిక్కర్ వేయని ఇళ్లు దాదాపు 70 శాతం ఉన్నాయని, కానీ సర్వే మాత్రం 90 శాతం పూర్తయిందని చెప్పడం ఏమిటన్నారు.

 

కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని వెల్లడించారు. ఆ పార్టీ తీరును బీసీలు ఖండించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.