- అప్పటివరకు తారిఖ్ రెహ్మాన్ భారత్‌కు రారు!
- ‘అనుకూల వాతావరణం’ ఏర్పడాలి.
- భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు షేక్ హసీనా అంశమే ప్రధాన అడ్డంకి.
ఢాకా, మహా.
భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు తెరపైకి వచ్చాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించే విషయంలో స్పష్టమైన పురోగతి కనిపించే వరకు ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటనకు వెళ్లే పరిస్థితి లేదని ఢాకా సంకేతాలిచ్చింది. భారత్‌లో తారిఖ్ రెహ్మాన్ పర్యటనకు ‘ప్రాపిషియస్ ఎన్విరాన్మెంట్’ (అనుకూలమైన వాతావరణం) ఏర్పడాల్సి ఉందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎ.కె.ఎం. షాహిదుల్ కరీమ్ స్పష్టం చేశారు. హసీనా అప్పగింతపై భారత్ వేగంగా నిర్ణయం తీసుకోవాలని ఢాకా కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటనపై ఇరు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పర్యటనకు అనుకూలంగా లేవని బంగ్లాదేశ్ భావిస్తోంది. హసీనా అప్పగింతతో పాటు బంగ్లాదేశ్ కోరుతున్న ఇతర పరారీలో ఉన్న నిందితుల అంశాల్లో కూడా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని ఢాకా చెబుతోంది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రకారం, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలంటే పరస్పర విశ్వాసాన్ని పెంచే వాతావరణం అవసరం.
2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఉద్యమం, హింసాత్మక పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. ఆమె పాలనలో విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో జరిగిన హింసకు సంబంధించి బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెను గైర్హాజరులో దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే హసీనా ఈ కేసును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఖండిస్తున్నారు.
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే భారత్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తన చట్టపరమైన ప్రక్రియ, సంబంధిత నిబంధనల ప్రకారం పరిశీలిస్తోందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో అప్పగింత అంశం రెండు దేశాల మధ్య అత్యంత సున్నితమైన దౌత్య అంశంగా కొనసాగుతోంది.
ఇటీవల న్యూఢిల్లీలో హసీనా మీడియాతో మాట్లాడటం ఢాకా ఆగ్రహానికి మరో కారణమైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందుగానే భారత్‌కు తన అభ్యంతరాలను తెలియజేసినప్పటికీ ఆ కార్యక్రమం జరగడం తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఢాకా పేర్కొంది. భారత్‌లో ఉంటూ హసీనా చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో జోక్యంగా కనిపిస్తున్నాయని బంగ్లాదేశ్ అభిప్రాయపడుతోంది. ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలన్న ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని ఢాకా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానంలో ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తోంది. సార్వభౌమాధికారం, పరస్పర గౌరవం ఆధారంగా భారత్‌తో సంబంధాలను కొనసాగించాలన్నదే తమ ఉద్దేశమని ఢాకా చెబుతోంది. అయితే హసీనా అంశంలో భారత్ నుంచి సానుకూల స్పందన లేకుండా సంబంధాలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమనే సంకేతాలను మాత్రం ఇస్తోంది.
తారిఖ్ రెహ్మాన్ 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, తన తొలి విదేశీ పర్యటనల్లో భారత్‌కు బదులుగా మలేషియా, చైనాలను ఎంచుకున్నారు. జూన్ 22న ఆయన మలేషియాలో అధికారిక పర్యటన చేశారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఇంధనం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని పేర్కొన్నాయి.
అయితే భారత్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. భౌగోళిక సమీపత, సరిహద్దు భద్రత, వాణిజ్యం, రవాణా అనుసంధానం, నదీజలాలు, ఇంధనం వంటి అనేక కీలక అంశాల కారణంగా ఢాకా-న్యూఢిల్లీ సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందువల్ల తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటన కేవలం ఒక సాధారణ ద్వైపాక్షిక పర్యటన కాకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే కీలక రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంది.
ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు పెరిగాయి. భారత్ కొత్త హైకమిషనర్ దినేశ్ త్రివేది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్‌ను కలిసిన సందర్భంగా కూడా హసీనా అప్పగింత అంశం చర్చకు వచ్చింది. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చేందుకు ‘అనుకూల వాతావరణం’ అవసరమని తారిఖ్ రెహ్మాన్ అప్పుడే పేర్కొన్నారు.
మరోవైపు, తారిఖ్ రెహ్మాన్ భారత్ పర్యటనకు సంబంధించిన తేదీలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆగస్టు 20 నుంచి 25 మధ్య పర్యటన జరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నప్పటికీ, అధికారికంగా తేదీలు ఖరారు కాలేదు. తాజాగా ఢాకా చేసిన వ్యాఖ్యలతో పర్యటనపై అనిశ్చితి మరింత పెరిగింది.








