హైదరాబాద్: మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు నగర వాసులకే కాకుండా మొత్తం తెలంగాణకే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకున్నదని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విజయవంతంగా నడుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా విజయాన్ని సాధించే సమయంలో అటువంటివి ఎదురవుతూనే ఉంటాయన్నారు. నగరంలో మెట్రో రైలు నిర్మాణ సమయంలో తన దిష్టి బొమ్మలు దహనం చేశారని, అలా చేసినవాళ్లే ఇప్పుడు పూలదండలతో తనని ఘనంగా సత్కరిస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. మెట్రో విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. రెండో దశ కూడా పూర్తయితే నగరం మరింత అభివృద్ధి అవుతుందని, అదేవిధంగా మేడ్చల్ వైపు కూడా నిర్మించాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. ఆ దిశగా కూడా ఆలోచిస్తామన్నారు.