- సెక్షన్ 22-A భూ రికార్డుల పునఃపరిశీలన!
- ఆ భూములను పక్కా ఆధారాలతో పూర్తి చేయాలి
- ప్రభుత్వ ప్రయోజనం ఉన్న భూములు మాత్రమే 22-A జాబితాలో ఉండాలి
- పాత రికార్డులను ప్రస్తుత పరిస్థితులతో సరిపోల్చాలి…
- ప్రతి సర్వే నంబర్‌కు ఆధారాలతో వర్క్‌షీట్ సిద్ధం చేయాలి
- సబ్-రిజిస్ట్రార్లతో సమన్వయంతో పనిచేయాలి
- అధికారులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: (ఆగస్టు 16)
సెక్షన్ 22-A కింద ఉన్న భూ రికార్డులను సమగ్రంగా పునః పరిశీలించి, ప్రభుత్వ ప్రయోజనం ఉన్న భూములను మాత్రమే 22-A జాబితాలో కొనసాగించాలని, ప్రభుత్వ ప్రయోజనం లేని భూములను సంబంధిత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయపరమైన ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
సెక్షన్ 22-A భూ రికార్డుల సవరణ పై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి సర్వే నంబర్‌ను లోతుగా పరిశీలించాలని సూచించారు. కేవలం గతంలో 22-A జాబితాలో ఉందనే కారణంతో భూమిని కొనసాగించరాదని, 22-Aలో కొనసాగించడానికి స్పష్టమైన ప్రభుత్వ ప్రయోజనం, సంబంధిత రికార్డులు, పక్కా ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రయోజనం ఉన్న కేటగిరీలను మాత్రమే పరిశీలించాలి…
సెక్షన్ 22-Aలోని 1-A నుంచి 1-E వరకు కేటగిరీలను సంబంధిత నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, సీలింగ్, ULC తదితర ప్రభుత్వ ప్రయోజనం ఉన్న భూములకు సంబంధించి పూర్తి ఆధారాలను పరిశీలించిన అనంతరం మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రయోజనం లేదని రికార్డుల ద్వారా నిర్ధారణ అయిన భూములను 22-A జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖస్రా పహాణీ, పహాణీ, IGRS రికార్డులు, పాత–కొత్త సర్వే నంబర్లు, గెజిట్ నోటిఫికేషన్లు, ULC/సీలింగ్ రికార్డులు, ల్యాండ్ అక్విజిషన్ రికార్డులు,సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు తదితర ఆధారాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
పాత రికార్డులను ప్రస్తుత పరిస్థితులతో సరిపోల్చాలి…
గతంలో వివిధ కారణాలతో 22-A జాబితాలో చేరిన భూములకు సంబంధించి అనంతరం రెగ్యులరైజేషన్, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు ఆదేశాలు లేదా ఇతర మార్పులు జరిగినప్పటికీ రికార్డులు అప్‌డేట్ కాకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
అందువల్ల ప్రతి సర్వే నంబర్‌ను ప్రస్తుత రికార్డులతో క్రాస్ వెరిఫై చేయాలని ఆదేశించారు. తప్పుగా నమోదైన విస్తీర్ణం, సర్వే నంబర్, కేటగిరీ తదితర వివరాలను సరి చేయాలని, జీరో ఎక్స్‌టెంట్ ఉన్న చోట సరైన వివరాలు నమోదు చేయాలని, అధికంగా నమోదైన విస్తీర్ణాన్ని సరిచేయాలని సూచించారు. రెగ్యులరైజ్ అయిన విస్తీర్ణాన్ని సంబంధిత ఆధారాల ప్రకారం గుర్తించి, అవసరమైన సవరణలు చేపట్టాలని తెలిపారు.
పార్ట్ సర్వే నంబర్లపై ప్రత్యేక శ్రద్ధ…
పార్ట్ సర్వే నంబర్ల విషయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఒకే సర్వే నంబర్ లో కొంత విస్తీర్ణం రెగ్యులరైజ్ అయి, మిగిలిన భాగం ప్రభుత్వ ప్రయోజనం ఉన్న సందర్భాల్లో రెండు భాగాల వివరాలను స్పష్టంగా గుర్తించాలని తెలిపారు.
ప్రతి పార్ట్ సర్వే నంబర్‌కు సంబంధించిన మొత్తం విస్తీర్ణం, రెగ్యులరైజ్డ్ భాగం, ప్రభుత్వ ప్రయోజనంలో ఉన్న మిగిలిన భాగం,సంబంధిత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.
వక్ఫ్, భూదాన్, సీలింగ్, ULC భూములపై లోతైన పరిశీలన…
వక్ఫ్ భూములకు సంబంధించి గజిట్‌లోని వివరాలను అసలు రికార్డులతో సరి పోల్చాలని కలెక్టర్ సూచించారు. వక్ఫ్ జాబితాలోని నంబర్ ను పొరపాటున సర్వే నంబర్‌గా నమోదు చేసిన సందర్భాలను గుర్తించి సరి చేయాలని తెలిపారు.
భూదాన్ భూముల విషయంలో పాత సర్వే నంబర్, కొత్త సర్వే నంబర్, సంబంధిత పాత రికార్డులు, భూమి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించి, పూర్తి ఆధారాలతో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
సీలింగ్, ULC భూముల్లో రెగ్యులరైజ్ అయిన విస్తీర్ణం, సర్ప్లస్‌గా మిగిలిన విస్తీర్ణాన్ని విడివిడిగా గుర్తించి, సర్వే నంబర్ వారీగా పూర్తి వివరాలు సిద్ధం చేయాలని తెలిపారు.
ప్రైవేట్ వివాదాలను 22-Aతో ముడిపెట్టవద్దు….
ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదాలు, కోర్టు కేసులు, స్టే, స్టేటస్‌కో, ఇంజంక్షన్ ఆర్డర్లు, IT/ED/ACB అటాచ్మెంట్లు తదితర అంశాలను కేవలం ఆ కారణంతో 22-A జాబితాలో చేర్చరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇలాంటి అంశాలకు సంబంధిత ప్రత్యేక రికార్డులు, మాడ్యూల్స్ లేదా ప్రత్యేక జాబితాలు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ భూములకు సంబంధించిన కోర్టు కేసులు, అటాచ్మెంట్లు తదితర అంశాలను సంబంధిత ఆన్‌లైన్ మాడ్యూల్‌లో నమోదు చేసి నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు.
సబ్-రిజిస్ట్రార్లతో సమన్వయం తప్పనిసరి…
22-Aకు సంబంధించి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, అభ్యంతరం లేదా సందేహాన్ని సంబంధిత తహసీల్దార్లు సబ్-రిజిస్ట్రార్‌తో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి కేసుకు ప్రత్యేక రిమార్క్ నమోదు చేసి, కేసు సంఖ్య, సర్వే నంబర్, అభ్యంతర స్వరూపం, పరిశీలించిన ఆధారాలు, తీసుకున్న నిర్ణయం తదితర వివరాలను రోజువారీ ప్రొఫార్మాలో నమోదు చేయాలని సూచించారు.
అవసరమైన రికార్డులను పూర్తిగా పరిశీలించకుండా వెంటనే ప్రతికూల సమాధానం ఇవ్వవద్దని, అవసరమైతే రెండు–మూడు రోజుల సమయం తీసుకుని పక్కా ఆధారాలతో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే సమాచారంతో, స్పష్టమైన సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి సర్వే నంబర్‌కు వర్క్‌షీట్ తప్పనిసరి…
22-A సవరణ ప్రక్రియలో ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక వర్క్‌షీట్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందులో పాత స్థితి, ప్రస్తుత స్థితి, మార్పుకు కారణం, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, రికార్డు ఆధారాలు, విస్తీర్ణ వివరాలు, ప్రతిపాదిత చర్య వంటి అంశాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
“ఈ సర్వే నంబర్‌ను 22-Aలో ఎందుకు కొనసాగిస్తున్నాం? దీనికి ప్రభుత్వ ప్రయోజనం ఏమిటి? అందుకు ఆధారం ఏమిటి?” అనే ప్రశ్నలకు ప్రతి కేసులో స్పష్టమైన సమాధానం ఉండేలా అధికారులు రికార్డులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఉన్నతస్థాయి సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి….
పెండింగ్ పనులను వేగవంతం చేయాలి
మండలాల వారీగా పూర్తయిన ఫార్ములు, సవరణలకు పంపిన ఫార్ములు, పెండింగ్‌లో ఉన్న గ్రామాలు, గుర్తించిన తప్పులు, పరిష్కరించిన అంశాల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న గ్రామాల పనులను త్వరితగతిన పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో జిల్లా స్థాయికి పంపాలని సూచించారు. పెద్ద విస్తీర్ణాలకు సంబంధించిన కేసులు, పార్ట్ సర్వే నంబర్లు, ULC/సీలింగ్, వక్ఫ్, భూదాన్, HMDA తదితర సున్నితమైన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు.
పారదర్శకమైన రికార్డులే లక్ష్యం…
సెక్షన్ 22-A సవరణ ప్రక్రియలో ప్రభుత్వ ప్రయోజనం ఉన్న భూమి పొరపాటున జాబితా నుంచి తొలగిపోకుండా, అదే సమయంలో ప్రభుత్వ ప్రయోజనం లేని భూమి జాబితాలో కొనసాగకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
క్లారిటీ లేని అంశాలను స్వయంగా నిర్ణయించి ముందుకు పంపకుండా, అవసరమైన సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి తన పరిధిలోని రికార్డులను పూర్తిగా పరిశీలించి, అవసరమైనప్పుడు పక్కా ఆధారాలతో సమాధానం చెప్పే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రయోజనం ఉన్న భూముల పరిరక్షణ, తప్పుగా నమోదైన వివరాల సవరణ, ఖచ్చితమైన రికార్డు నిర్వహణ, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం ద్వారా సెక్షన్ 22-A భూ రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.








