Mahaa Daily Exclusive

  ఎంత జ‌నాభాకు అంత భాగ‌స్వామ్యం.. తెలంగాణ‌లో సామాజిక, ఆర్థిక, కుల స‌ర్వే 92 శాతం పూర్తి..

Share

  • సంవిధాన్ ర‌క్ష‌క్ అభియాన్ సద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

 

న్యూఢిల్లీ, మహా : దేశ‌వ్యాప్తంగా కుల‌ గ‌ణ‌న అనేది కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్య‌మ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధ‌మ ప్ర‌ధాన‌మంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వ‌ర‌కు ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు, బ్యాంకుల జాతీయీక‌ర‌ణ వంటి కార్య‌క్ర‌మాల‌తో సామాజిక న్యాయం మొద‌టి ద‌శ సాధిస్తే… రాజీవ్ గాంధీ హ‌యాంలో 18 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. మండ‌ల్ క‌మిష‌న్ నివేదిక వంటి కార్య‌క్ర‌మాల‌తో సామాజిక న్యాయం @ 2.0 పూర్త‌యింద‌ని.. ఇప్పుడు సోనియా గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీల ఆధ్వ‌ర్యంలో కుల గ‌ణ‌న‌కు సామాజిక న్యాయం@ 3.0 ప్రారంభ‌మైంద‌న్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మ‌హా యుద్ధం ప్ర‌క‌టించార‌ని… ఆయ‌న బాట‌లో న‌డుస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సామాజిక‌, ఆర్థిక‌, కుల స‌ర్వే మొద‌లుపెట్టింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో స‌ర్వే 92 శాతం పూర్త‌యింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీ త‌ల‌క‌టొరా స్టేడియంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన సంవిధాన్ ర‌క్ష‌క్ అభియాన్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో కుల స‌ర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మ‌హా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. జితని భాగి దారి.. ఉతని హిస్సే దారి.. క‌చ్చితంగా అమ‌లు కావాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌దేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదం లో ఉంద‌ని, రాజ్యాంగ ర‌క్ష‌ణ‌కు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త‌ ఉద్యమం చేపట్టార‌న్నారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్ర‌జ‌లు భాగ‌స్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్ర‌జ‌లు కేవలం 240 సీట్ల‌కు ప‌రిమితం చేశార‌ని సీఎం అన్నారు. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీని ప్ర‌జ‌లు ఓడిస్తున్నార‌ని.. వ‌య‌నాడ్‌, నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలే అందుకు నిద‌ర్శ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మ‌హారాష్ట్రలో బీజేపీ కూట‌మి గెలిస్తే, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ కూట‌మి గెలిచింద‌న్నారు. రాజ్యాంగ ర‌క్ష‌ణ ఉద్య‌మం కేవలం రాహుల్ గాంధీకి ప‌రిమిత‌మైన అంశంగా అనుకోవ‌ద్ద‌ని, మ‌న‌మంతా అందులో భాగ‌స్వాములు కావాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్ర‌స్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు… రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉంద‌ని గుర్తుంచుకోవాల‌న్నారు. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ ర‌క్ష‌ణ‌కు పూనుకుంటే… మోదీజీ ప‌రివార్ అంటే సంఘ్ ప‌రివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నార‌ని సీఎం విమ‌ర్శించారు.