- ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ
- మరో మూడు రాష్ట్రాల్లో మూడు ఖాళీలు
- డిసెంబరు 20న పోలింగ్
- అదే రోజున ఓట్ల లెక్కింపు
న్యూడిల్లీ, మహా : ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది.
రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు డిసెంబరు 10. డిసెంబరు 11న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబరు 13 తుది గడువు అని షెడ్యూల్ లో పేర్కొన్నారు. అవసరమైతే డిసెంబరు 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలు చేయడంతో రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. షఎడ్యూల్ వెల్లడి కావడంతో ఏపీ టీడీపీ నేతల్లో కొంత మంది తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. అధినేత చంద్రబాబునాయుడు, కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల ప్రసన్నం కోసం ప్రయత్నాలను మొదలు పెట్టారు.