బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌కు రావాలని, ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. అన్ని అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆరేనని ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం వృథా అని, ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దామన్నారు. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేల్చుదామన్నారు.
సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఇథనాల్ కంపెనీకి గత ప్రభుత్వం అనుమతులిచ్చే నాటికి కంపెనీ డైరెక్టర్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి ఉన్నట్లు తెలిపారు. ఇథనాల్ కంపెనీ మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ తనయుడు ఉన్నట్లు చెప్పారు. పుట్టా సుధాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులని గుర్తు చేశారు. గతంలో గ్రామసభను నిర్వహించకుండానే ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దిలావర్‌పూర్‌కు వచ్చేందుకు కేటీఆర్ సిద్ధమా? కాదా? చెప్పాలన్నారు.
హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న సంఘటనల వెనుక కుట్ర ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కుట్రలపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని హెచ్చరించారు. కుట్రలకు పాల్పడే అధికారులపై క్రిమినల్ చర్యలు పెడతామన్నారు. అవసరమైతే అధికారులను సర్వీసుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అన్ని విషయాలను ఆధారాలతో బయటపెడతామన్నారు. హాస్టళ్లలోని ఘటనల వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.