Mahaa Daily Exclusive

  కర్ణాటకకు సింగరేణి బొగ్గు..! కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌తో సంయుక్త భాగస్వామ్యానికి భట్టి ప్రతిపాదన..

Share

  •  ఇంధన రంగంలో రెండు రాష్ట్రాల కొత్త భాగస్వామ్యం.
  •  మైనింగ్‌లో సింగరేణి అనుభవం.
  •  కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌తో సంయుక్త భాగస్వామ్యానికి భట్టి ప్రతిపాదన.

బెంగళూరు, మహా.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే.జే. జార్జ్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఇంధన సరఫరా ఒప్పందాలు, సింగరేణి బొగ్గు సరఫరా, భవిష్యత్‌ మైనింగ్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ అవసరాలకు నిరంతరాయంగా బొగ్గు అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ఇరువురు మంత్రులు సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.

ఇప్పటికే తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ, కర్ణాటక విద్యుత్‌ సంస్థల మధ్య ఉన్న బొగ్గు సరఫరా ఒప్పందాల అమలు తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కర్ణాటక విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా సింగరేణి నుంచి జరుగుతున్న బొగ్గు సరఫరా, ప్రస్తుతం ఉన్న సరఫరా విధానం, భవిష్యత్‌లో అవసరమయ్యే బొగ్గు పరిమాణంపై అధికారులు వివరాలు అందించారు. కర్ణాటక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును నిర్ణీత సమయంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.

కర్ణాటకకు చెందిన జెన్కో సంస్థకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు బ్లాకుల మైనింగ్‌లో సింగరేణి సంస్థకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. బొగ్గు గనుల అన్వేషణ, అభివృద్ధి, ఉత్పత్తి, నిర్వహణ రంగాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక, నిర్వహణ అనుభవాన్ని కర్ణాటక విద్యుత్‌ సంస్థలు ఉపయోగించుకునేలా రెండు రాష్ట్రాల మధ్య సహకారం పెంచుకోవాలని సూచించారు.

కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సింగరేణి సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో మైనింగ్‌ కార్యకలాపాల్లో ముందుకు వెళ్లాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే.జే. జార్జ్‌ సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థలు పరస్పర అనుభవాన్ని వినియోగించుకుని కొత్త ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని భట్టి పేర్కొన్నారు.

అదే సమయంలో కర్ణాటక జెన్కోకు విద్యుత్‌, ఇంధన రంగంలో ఉన్న అనుభవాన్ని సింగరేణి సంస్థ కూడా వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. విద్యుత్‌ ఉత్పత్తి, ఇంధన నిర్వహణ, మైనింగ్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు, భవిష్యత్‌ ఇంధన అవసరాల ప్రణాళికలో కర్ణాటక అనుభవాన్ని అధ్యయనం చేసి సింగరేణి భవిష్యత్‌ ప్రాజెక్టులకు ఉపయోగపడే విధంగా పరస్పర సహకారం పెంచుకోవాలని సూచించారు.

కర్ణాటక రాష్ట్రానికి ప్రస్తుతం ఎదురవుతున్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే.జే. జార్జ్‌ కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, విద్యుత్‌ డిమాండ్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉన్నందున కర్ణాటక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని ఆయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని కోరారు.

కర్ణాటక విజ్ఞప్తికి స్పందించిన భట్టి విక్రమార్క సింగరేణి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రోజుకు నాలుగు బొగ్గు రేక్‌లను సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. కర్ణాటక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల అవసరాలకు అనుగుణంగా బొగ్గు రవాణాలో సమన్వయం పెంచాలని, సరఫరా ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

కర్ణాటక విద్యుత్‌ అవసరాల కోసం ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి ఏడాదికి ఒక మిలియన్‌ టన్నుల బొగ్గును అందించేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని సంస్థ అధికారులు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. నైని బొగ్గు గని నుంచి కర్ణాటకకు అవసరమైన బొగ్గును సరఫరా చేసే సామర్థ్యం సింగరేణికి ఉందని వివరించారు. ఈ అంశాన్ని భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే.జే. జార్జ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

నైని బొగ్గు గని నుంచి బొగ్గు సరఫరా ద్వారా కర్ణాటక విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలకు స్థిరమైన ఇంధన వనరు అందుబాటులోకి వస్తుందని భట్టి తెలిపారు. సింగరేణి వద్ద ఉన్న బొగ్గు వనరులు, మైనింగ్‌ సామర్థ్యం, రవాణా వ్యవస్థను సమన్వయం చేసుకుని కర్ణాటకకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న బొగ్గు సరఫరా ఒప్పందాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త అవకాశాలను గుర్తించాలని సమావేశంలో నిర్ణయించారు. కర్ణాటక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు అవసరమైన బొగ్గు సరఫరా స్థిరంగా ఉండేలా సింగరేణి, కర్ణాటక విద్యుత్‌ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఇరువురు మంత్రులు సూచించారు.

సమావేశం అనంతరం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న కర్ణాటకలోని ఖనిజ బ్లాకును పరిశీలించనున్నారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో ఉన్న బంగారం, రాగి ఖనిజ బ్లాకును సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఖనిజ బ్లాక్‌లో అన్వేషణ, భౌగోళిక పరిస్థితులు, ఖనిజ నిక్షేపాల లభ్యత, భవిష్యత్‌ మైనింగ్‌ అవకాశాలను అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించనున్నారు.

బంగారం, రాగి ఖనిజాల అన్వేషణలో సింగరేణి సంస్థ చేపట్టాల్సిన తదుపరి చర్యలపై కూడా భట్టి విక్రమార్క సమీక్ష చేయనున్నారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమావేశమై ఖనిజ అన్వేషణకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, స్థానికంగా చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సింగరేణి సంస్థను కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగా కాకుండా భవిష్యత్‌లో వివిధ ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌ రంగాల్లో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజ బ్లాక్‌ను సింగరేణి వేలంలో దక్కించుకోవడం సంస్థ విస్తరణలో భాగంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఖనిజ అన్వేషణ, మైనింగ్‌ కార్యకలాపాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక సామర్థ్యాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు.

తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇంధన రంగ సహకారాన్ని మరింత విస్తరించేందుకు సమావేశం దోహదపడనుంది. ఒకవైపు కర్ణాటకకు సింగరేణి నుంచి నిరంతర బొగ్గు సరఫరా, మరోవైపు కర్ణాటక జెన్కోతో కలిసి మైనింగ్‌ రంగంలో పనిచేసే అవకాశం ఏర్పడటంతో రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. కర్ణాటకలోని విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలకు సింగరేణి వనరులను వినియోగించడంతో పాటు కర్ణాటక సంస్థల అనుభవాన్ని తెలంగాణ సంస్థ భవిష్యత్‌ ప్రాజెక్టులకు ఉపయోగించుకునేలా పరస్పర సహకారం కొనసాగించాలని భట్టి విక్రమార్క సూచించారు.

భట్టి విక్రమార్క వెంట సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకన్నతో పాటు సంస్థకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కర్ణాటక ఇంధన శాఖ, విద్యుత్‌ సంస్థల అధికారులు కూడా సమావేశంలో పాల్గొని బొగ్గు సరఫరా, మైనింగ్‌ భాగస్వామ్యం, భవిష్యత్‌ ఇంధన అవసరాలపై చర్చించారు.