Mahaa Daily Exclusive

  దళపతి విజయ్‌పై సమంత ప్రశంసల జల్లు!

Share

చెన్నై, మహా.

‘మా ఇంటి బంగారం’ చిత్రం తర్వాత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ నాయిక సమంత రూత్ ప్రభు, ప్రస్తుతం బుల్లితెరపై రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే, ఈ షో షూటింగ్ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఓ ఎపిసోడ్‌లో ఆమె కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్‌పై చేసిన ప్రశంసలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

షోలో భాగంగా నిర్వహించిన ‘హీరో వర్సెస్ విలన్’ ఛాలెంజ్ సమయంలో, ఆర్జే విజయ్ సమంతను ఆమె అభిమాన నటుడు ఎవరంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సమంత ఏమాత్రం తటపటాయించకుండా విజయ్‌ను తన ‘లక్కీ ఛార్మ్’ అని అభివర్ణించారు. విజయ్ పట్ల తనకున్న అభిమానం ఎలాంటి రహస్యం కాదని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. విజయ్ తన సినీ కెరీర్‌లో ఎంతో కఠోర శ్రమను నమ్ముకున్నారని, ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఇదే సందర్భంలో నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది అభిమానులు ఉండి కూడా, ఒక నాయకుడిగా ప్రజా సేవను, పరిపాలనను ఎంచుకోవడం సాధారణ విషయం కాదన్నారు. తెర వెనుక ఎంతో నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో కష్టపడుతూ ఆయన ముందుకు సాగుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. కెరీర్ అత్యున్నత శిఖరాగ్రంలో ఉన్న సమయంలో సినిమా రంగాన్ని పక్కన పెట్టి, ప్రజల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించడం అంత సులభమైన నిర్ణయం కాదని.. అయితే విజయ్ మాత్రం సరైన సమయంలోనే రాజకీయ రంగప్రవేశం చేశారని సమంత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.