Mahaa Daily Exclusive

  అప్పుల బాధతో కన్న కూతుళ్ళని చంపిన కిరాతకుడు…!

Share

పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరి.

నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.. ఇతనికి ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7).

నాగాంజనేయ శర్మ విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది.. దీంతో మంచం పట్టిన భార్యను వదిలేసి, ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.

ఇద్దరు పిల్లలను ఆసుపత్రిలో చూపించాలంటూ బైక్ పై ఎక్కించుకొని, ముప్పాళ్ల కాల్వలోకి బైక్ ను తీసుకెళ్ళాడు.. దీంతో ఊపిరాడక చిన్న కూతురు చనిపోయింది.

ఈత వచ్చిన నాగాంజనేయ శర్మ మునగకపోవడంతో పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకొని “నాన్న, మమ్మల్ని చంపొద్దు.. నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్న.. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటికి తీయి నాన్నా” అంటూ బ్రతిమిలాడింది.

కానీ ఏమాత్రం చలించని నాగాంజనేయ శర్మ కాలు పట్టుకున్న బిడ్డను వదిలించుకున్నారు. దీంతో పెద్ద కూతురు కూడా మునిగి చనిపోయింది.

నాగాంజనేయ శర్మకు ప్రాణం మీద తీపి పుట్టిందేమో, పిల్లలని చంపేసి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు.. ఇదంతా చూసిన పాల వాహనం డ్రైవర్ సమాచారం ఇవ్వగా, పోలీసులు నాగాంజనేయ శర్మను అదుపులోకి తీసుకొని, కాలువలో నుండి పిల్లల మృతదేహాలు బయటకి తీశారు.