Mahaa Daily Exclusive

  విద్యుత్తు రంగంలో కొత్త వెలుగులు.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి..

Share

  • తెలంగాణ తలెత్తుకునేలా నిర్ణయాలు
  • అవకతవకలపై.. విచారణ
  • రైతుల సంక్షేమమే లక్ష్యంగా రూ. 10,444 కోట్లు ఉచిత విద్యుత్తు సబ్సిడీ భారం భరించిన ప్రభుత్వం

 

మహా-

విద్యుత్తు రంగంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. పదేండ్ల అవకతవకలకు ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ట్రాన్స్కో, జెన్కోతో పాటు డిస్కంలు.. విద్యుత్తు సంస్థన్నింటా దుబారాను తగ్గించి విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కొత్త పునరుజ్జీవ ఇందన విధానం రూపొందిస్తోంది. దివాళా బాటలో ఉన్న విద్యుత్తు సంస్థలను గాడిలో పెట్టేందుకు తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మక విధానాలు అనుసరించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి భారీ అప్పులు, వేల కోట్ల నష్టాలతో విధ్వంసమైన తీరుపై శ్వేత పత్రం విడుదల చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా కొనసాగించింది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి ఏడాదిలోనే రూ. 10,444 కోట్లు ఉచిత విద్యుత్తు సబ్సిడీ భారాన్ని భరించింది. దాదాపు 29 లక్షల మంది రైతులు ఉచిత కరెంట్ ద్వారా లబ్ధి పొందారు. గత పదేండ్లలో దాదాపు రూ.20 వేల కరెంటు ఛార్జీల మోత మోసిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్రంలో 1.85 కోట్ల మంది వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వినియోగదారులకు విద్యుత్తు అందిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు అందించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 39067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. దీనికి ప్రభుత్వం రూ. 101.57కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. రోజువారీ అత్యధిక విద్యుత్తు డిమాండ్లో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా పెద్ద రాష్ట్రాలను సైతం అధిగమించింది. గత ఏడాది 2023 ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్లో ఎనిమిదో ర్యాంకులో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది అయిదో ర్యాంకుకు చేరింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15,623 మెగావాట్ల ఆల్ టైమ్ హై పీక్ డిమాండ్‌ విద్యుత్తును సమర్థంగా సరఫరా చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. గత ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలతో ఏళ్లకేళ్లు ఆలస్యమైన యాదాద్రి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి దశలోని రెండు యూనిట్ల నిర్మాణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. సెప్టెంబర్ 12న యూనిట్ 1, 2 గ్రిడ్కు అనుసంధానం చేశారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 800 మెగావాట్ల ఒక యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. దేశంలోనే వినూత్నంగా మహిళా శక్తి సంఘాల అధ్వర్యంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో సంఘం అధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో నూటికి నూరు శాతం సౌర విద్యుత్తు వినియోగించే మోడల్ ప్రాజెక్టును చేపట్టింది. రెప్పపాటు కోత లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు, ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ఇలా విద్యుత్ రంగాన్నిసమర్ధనిర్వహణతో ముందుకు తీసుకువెళ్తోంది.