Mahaa Daily Exclusive

  ఆదివారం ఈ అంగట్లో స్వెటర్లు అగ్గువా..!

Share

  • -మంకీ క్యాప్స్, మఫ్లర్స్ కూడా అవైలబుల్
  • -ఏది కొన్నా ధర తక్కువే
  • -సండేస్ మాత్రమే ఈ ఆఫర్

 

హైదరాబాద్, మహా: ప్రస్తుతం చలికాలం కావడంతో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే వారు చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలు తీసుకుంటున్నారు. ఉన్ని దుస్తువులు, స్వెటర్లు, మంకీ క్యాప్ లు, మఫ్లర్లు ధరిస్తూ వెచ్చదనం పొందుతున్నారు. అయితే, ప్రతిసారి లాగా ఈసారి కూడా స్వెటర్లు, మంకీ క్యాప్స్, మఫ్లర్స్ వాడే వారి సంఖ్య పెరిగింది. వాటి గిరాకీ పెరిగింది. ఇవి కొంత కాస్ట్లీ ఉండడంతో సామాన్య ప్రజలు కొనలేకపోతుంటారు. వారు షాపింగ్ మాల్స్ లోకి వెళ్లి వాటిని కొనుగోలు చేయలేకపోతుంటారు. దీంతో వారు తక్కువ ధరలో ఈ స్వెటర్లు ఎక్కడ దొరుకుతాయిని ఆలోచిస్తుంటారు. అయితే, స్వెటర్లు, బ్లాంకెట్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్ లు.. ఇలా అన్ని దస్తువులు ఒకచోట దొరికే మార్కెట్ నగరంలో ఉంది. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ దుస్తువులే కాదు.. ఇతర ఎన్నోవస్తువులు కూడా ఇక్కడ లభ్యమైతాయి. అందుకే వేల సంఖ్యలో కస్టమర్లు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. దీంతో అక్కడ జాతరను తలపిస్తుంటుంది వాతావరణం. ఇదంతా ప్రతిరోజూ కాదు.. కేవలం ఆదివారం ఒక్కరోజు మాత్రమే. మరి ఇవన్ని లభ్యమయ్యే చోటు ఎక్కడంటారా..? అదే ఎర్రగడ్డ మార్కెట్. ఇది కేవలం ఆదివారం మాత్రమే కొనసాగుతుంది. తెల్లతెల్లవారుజామున మొదలవుతుంది ఈ సంత. ఈ అంగట్లో ఏ వస్తువు కావాలన్నా కూడా లభ్యమవుతుంది. కిలో మీటర్ల మేరా ఇక్కడ సంత కొనసాగుతుంది. వెయ్యిందికి పైగా చిరువ్యాపారులు రకరకాల వస్తువులను విక్రయిస్తుంటారు. ఈ సంత అంతా కూడా రోడ్డు మీదనే కొనసాగుతుంది. రోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారులు చేరి గూడారాలుగా, తోపుడు బండ్లపై వస్తువులను విక్రయిస్తుంటారు.

 

సందడి సందడిగా…

 

ఈ సంత శతాబ్ధ కాలం నాటిదని చెబుతుంటారు. ఎర్రగడ్డ చౌరస్తా నుంచి సనత్ నగర్ బస్టాండ్ వరకు ఆదివారం అంగడి కొనసాగుతుంది. ఈ సంతలో దస్తువులతోపాటు మిగతా వస్తువులను కూడా అమ్ముతుంటారు. ఇంట్లో అవసరమయ్యే ప్రతి వస్తువు ఇక్కడ విక్రయిస్తారు. స్క్రూడ్రైవర్ నుంచి సూట్ కేస్ వరకు, బొమ్మలు, స్మార్ట్ ఫోన్లు.. ఇలా ప్రతిదీ ఇక్కడ విక్రయిస్తుంటారు. దీంతో ప్రతి ఆదివారం ఈ ఎర్రగడ్డ మార్కెట్ కు ఇసుకేస్తే రాలనంత జనాలు వస్తుంటారు. నగర వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుని వెళ్తుంటారు. దీంతో సండే రోజు ఈ మార్కెట్ జనాలతో సందడి సందడిగా ఉంటుంది.

 

 

సీజన్ కు తగ్గట్టుగా దుస్తువులు…

 

ముఖ్యంగా దుస్తువుల విషయానికి వస్తే ఈ మార్కెట్ లో సీజన్ కు తగ్గట్టుగా విక్రయిస్తుంటారు. ఎండకాలంలో కాటన్ దుస్తువులను విక్రయిస్తుంటారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, గొడుగులు అమ్ముతుంటారు. ఇక చలికాలంలో కూడా స్వెటర్లు, మంకీ క్యాప్ లు, షాల్స్, మఫ్లర్స్.. ఇలా సీజన్ బట్టి విక్రయిస్తుంటారు. ప్యాంట్, షర్ట్స్.. ఇలా మిగతా దుస్తువులు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతిఆదివారం విక్రయిస్తుంటారు. అయితే, ఇక్కడ చాలా తక్కువ ధరకే విక్రయిస్తుంటుంటారు. వాటి నాణ్యత కూడా బాగానే ఉంటుందని రెగ్యులర్ కస్టమర్లు చెబుతుంటారు. కాకపోతే వాటిని కొనుక్కునేటప్పుడే చూసి తీసుకోవాలని సలహా ఇస్తుంటారు.