నిర్మల్ మహా : జిల్లాలోని పలు చారిత్రాత్మక ప్రదేశాలను దశలవారీగా అభివృద్ధి చేయాలని , పర్యాటకులను ఆకర్షించే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని శ్యామ్ ఘడ్ కోట, ధర్మసాగర్ చెరువు (మినీ ట్యాంక్ బండ్)
ను ఆమె అధికారులతో కలిసి సందర్శించారు. శ్యామ్ ఘడ్ కోట వద్ద చేపట్టనున్న ఫుట్ పాత్, రోడ్డు వెడల్పు, విద్యుత్ దీపాల ఏర్పాటు పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పురాతన కట్టడాల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. చారిత్రాత్మక ప్రదేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. . హైమస్ లైట్లను ఏర్పాటు చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలన్నారు.
మినీ ట్యాంక్ బండ్ ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మురికినీరు చెరువులో కలవకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కు స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ హరిభువన్, నిర్మల్ అర్బన్ తహసిల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.