- రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా విద్యాకమిషన్
- ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా : గురుకులాల కార్యదర్శిగా తాను పని చేసిన సమయంలో అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం విచారణ చేసి తనను జైలుకు పంపవచ్చని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ గురుకుల బాట పడతామంటే, సమస్యలు పరిష్కరించాల్సింది పోయి మతిస్తిమితం లేని నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ స్థాయికి తాను దిగజారలేనని, వారికి మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కుట్ర చేసి విషాహారం అని మాతృమూర్తిగా ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్, వరంగల్లో కొండా కుటుంబం చేసిన అఘాయిత్యాలతో ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. నేర చరిత్ర పెట్టుకొని కొండా సురేఖ తమపై అభాండాలు వేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంత్రి సీతక్క మూలాలు మరచి మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆక్షేపించారు. తాను అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే సీబీఐ విచారణ చేయించండని సవాల్ విసిరారు. గురుకులాలపై తాము కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు.
కుట్ర ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా మారడం లేదని, చేతకాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్కు అప్పగించాలని అన్నారు. కాంగ్రెస్కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని, రాజకీయాలు చేయవద్దని కోరారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి గురుకులాలు, పాఠశాలలకు వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. 50 మంది విద్యార్థులు చనిపోతే విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి ఒక్కరిని కూడా పరామర్శించలేదని ఆక్షేపించిన ఆయన, విద్యా కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిందా? అని ప్రశ్నించారు. పిల్లలు పిట్టల్లా రాలుతుంటే విద్యా కమిషన్ ఎక్కడకు పోయిందని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో సమస్యలపై అధ్యయనానికి వెళ్తున్నామని, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా బీఆర్ఎస్వీ 85220-44336 నంబర్కు పంపాలని సూచించారు.