Mahaa Daily Exclusive

  ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్‌..

Share

  • ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు
  • చెన్నైకి 190 కి.మీ ల దూరంలో కేంద్రీకృతమైన ఫెంగల్ తుఫాన్

 

హైదరాబాద్, మహా : ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్ ‘ తుపాన్ కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తాజా బులెటిన్ లో వివరించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

 

తెలంగాణలోనూ వర్షాలు – హెచ్చరికలు జారీ

 

తెలంగాణకు కూడా ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. శనివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. పంట చేతికి వచ్చి చాలా చోట్ల ధాన్యం కల్లాలలో ఉన్నందున ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా ప్రాంతాలలో రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించాయి.