- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలి
- 10 ఏళ్ళల్లో చేయలేని పనులను 10 నెలల్లో చేశాం
- గతంలో కుటుంబం బాగు పడింది
- ఇప్పుడు తెలంగాణ బాగుపడుతుంది
- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మహా : పార్టీ కోసం కష్టించి పని చేసిన ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, సరైన సమయంలో సరైన విధఁగా వారికి ప్రాధాన్యం పార్టీ ఇస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్చీలోని కింద స్థాయి నాయకుల కష్టంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోని నేతలకు అన్ని రకాల పదవులల్లో అవకాశం కల్పిస్తామన్నారు. శనివారం గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గడచిన దశాబ్ధ కాలంగా రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళదని ఆయన విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ నేతలు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేసినా బీఆర్ఎస్ నేతలు మనపై అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. మనం చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్‌కు ఆయన కీలక సూచన చేశారు.
బీఆర్ఎస్, బీజేపీలు మనపై చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం 18 వేల కోట్లు కేటాయించామని, ఇంకా 3 వేల కోట్లు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ళలో రైతులకు ఏం చేయలేదన్నారు.
ఇచ్చిన హామీల.ప్రకారం బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నారు. బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ది పొందుతుందని ఆరోపించారు. అయితే బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోడీ అబద్దాలను సైతం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత మనపై ఉందని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి అభివృద్ధి చేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కులగణన సర్వే ఎంత అవసరమో ఆయన వివరించారన్నారు. అదే ప్రస్తుతం తెలంగాణలో అమలు జరుగుతుందని వివరించారు. రాహుల్ గాంధీ స్వాతిముత్యం అంత మంచి వాడని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. ఆయన అన్ని రకాల మంచి పనులు చేస్తున్నారని తెలిపారు. నాగార్జున సాగర్‌లో వారం రోజుల పాటు ఆదివాసీ క్యాంపు నిర్వహించనున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆదివాసీ అంశాలపై లోతుగా చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ లో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించనున్నామని ఏఐసీసీ జాతీయ నాయకులు కొప్పుల రాజు తెలిపారు. రోజుకు 7,8 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.