Mahaa Daily Exclusive

  సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ గుండెపోటుతో మృతి..

Share

  • నేడు మేడ్చల్ మల్కాజ్ జిల్లా యాప్రాల్ లో అంత్యక్రియలు
  • సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల సందర్శనార్ధం
  • ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మగ్ధూంభవన్ బాలమల్లేష్ భౌతికకాయం

 

హైదరాబాద్, మహా : సి పి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ గుండెపోటుతో శనివారం సాయంత్రం అకాల మరణం చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్య్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఎ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సి పి ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. బాలమల్లేష్ కు భార్య వందన, కుమారుడు నిషాంత్, కుమార్తె నికిత ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాప్రాల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో 1966 జూన్ 15వ తేదీన బాలమల్లేష్ జన్మించారు. బాలమల్లేష్ ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రి సాయిలు మరణించడంతో తల్లి మల్లమ్మ అన్ని తానై పెంచారు. బాలమల్లేష్ విద్యార్థి దశలో తన ఉద్యమ సహచరరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎ.ఆర్.దేవరాజ్ కుమార్తె వందనను వివాహం చేసుకున్నారు. విద్యార్థి దశలో సికింద్రాబాద్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ విద్యార్థి ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులైన బాలమల్లేష్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్)లో చేరారు. అభ్యుదయ భావాలు కలిగిన బాలమల్లేష్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జరిగే ఉద్యమాల్లో చరుకుగా పాల్గొన్నారు. విద్యార్థి సంఘంలో పనిచేస్తూనే, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ రెడ్ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ లక్డికాపూల్ బాబూ జగ్జీవన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎ ఐ ఎస్ ఎఫ్ నుంచి బాలమల్లేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1990 దశకంలో క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా, ఇతర విద్యార్థి సమస్యలపై ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాల్లో బాలమల్లేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కర్యాదర్శిగా, అధ్యక్షుడిగా, ఎ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీకి కొంత సంక్షోభం వచ్చిన కాలంలో జిల్లాలో పార్టీని నిలబెట్టడానికి బాలమల్లేష్ కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించగా, ఇటీవలే సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమకొండలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నిర్మాణ సమితి సమావేశాలలో బాలమల్లేష్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బి కె ఎం యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బి సి హక్కుల సాధన సమితికి ప్రధాన కార్యదర్శిగా, మేడ్చల్ మల్కాజ్ వికారాబాద్ జిల్లాలకు పార్టీ నుండి నిర్మాణ బాధ్యుడిగా బాలమల్లేష్ వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ఏ పని అప్పజెప్పినా వీర సైనికుడిగా పనిని స్వీకరించి పూర్తి చేసేవారు. అన్ని వామపక్ష పార్టీలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను సమన్వయం చేసే విషయంలో అలుపెరగకుండా కృషి చేశారు. ప్రజా సంఘాలు, పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన బాలమల్లేష్ తన జీవితం మొత్తాన్ని పార్టీకే అంకితం చేశారు.

ఆదివారం 4 గంటలకు అంత్యక్రియలు

బాలమల్లేష్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు మేడ్చల్ మల్కాజ్ జిల్లా యాప్రాల్ గ్రామంలోని శ్మశానవాటికలో జరుగుతాయి. అంతకు ముందు కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సందర్శనార్ధం బాలమల్లేష్ భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు హైదరాబాద్ హిమాయత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ ఉంచుతారు. అనంతరం బాలమల్లేష్ అంతిమయాత్ర హిమాయత్ నుంచి యాప్రాల్ కొనసాగనుంది.