- అభివృద్ధి నమూనా అవిష్కరించిన సీఎం
- రూ.14వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
పాలమూరు ప్రతినిధి, మహా-
పాలమూరు జనసంద్రమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకంతో పాలమూరు రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా రైతు పండుగ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గత మూడు రోజులుగా రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా మంత్రివర్గమంతా హాజరైంది. రూ. 14 వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేయడంతో పాటు ఎవడు అడ్డుపడ్డా పాలమూరు రూపురేఖలు మార్చి ప్రగతిపూలు పూయిస్తానని ప్రకటించారు.
ఈ పండుగ సందర్భంగా వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తులు, విత్తనాల రకాలు, సేద్యంలో వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన పరికరాలు, పనిముట్లతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయడంపై రైతుల్లో అవగాహన పెంచడానికి ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లతో పాటు ప్రదర్శనగా ఉంచిన వివిధ జాతులకు చెందిన పశువులు, గేదెల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంగా ఒక్క ఏడాది… సాధించిన విజయాలెన్నో… పేరుతో పోస్టర్ ను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం ముందు సాగునీటి వెతలు తీరుస్తానని, ఐదేళ్ళలో లక్షకోట్లు ఖర్చుపెట్టి మనమే పాలమూరును మార్చకుందామంటూ స్థానిక సెంటిమెంట్ రగిలించారు. మొత్తంగా సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ సక్సెస్ కావడం నేతలు, క్యాడర్ లో ఉత్సాహం నింపింది. తర్వాత సభ పెద్దపల్లి లో డిసెంబర్ 4న జరగనుంది.