జీడిపల్లి – బైరవానితిప్ప ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయిందని, దాన్ని పూర్తి చేస్తే చాలా వెసులుబాటు వస్తుందన్నారు. గతంలో 950 కోట్లు మంజూరు చేసి, అందులో 35 శాతం పనులు చేస్తే దానిని పక్కన పెట్టారని, దానిని పూర్తిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. నేమకల్లు – గుంతకల్లు మధ్య అయిదు టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ ను మంజూరు చేస్తున్నామని, దాని ద్వారా ఈ ప్రాంత పరిసర గ్రామాలలో నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. హంద్రీనీవా 36 ప్యాకేజీలో మాల్యం- అవలదట్ల మధ్య తలపెట్టిన బ్రాంచ్ కాలువను పటిష్టం చేస్తామన్నారు. రాయదుర్గం మున్సిపాలిటీకి ఇబ్బందుల్లో ఉందని చెప్పారని, ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తామన్నారు. బొమ్మనహాల్ లో 25,000 ఎకరాల్లో ఇసుక మేటలు, దిబ్బలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం అర కిలోమీటర్ పెరుగుతోందని, ఇసుక మేటలు, దిబ్బలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. వేదవతి హగరిలో సబ్ సర్ఫేస్లు కావాలని అడిగారని, అభివృద్ధి చేసే పనులు చేస్తామన్నారు. డి.హీరేహాల్లో పర్కులేషన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, నేమకల్లు- డి.హీరేహల్ మధ్యలో ఒక పారిశ్రామిక కస్టర్ తయారు చేస్తామన్నారు. బొమ్మనహల్ మండలం శ్రీధరగట్ట గ్రామానికి తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీరు ఇవ్వాలని కోరారని, వాటిని మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి ప్రత్యేక పరిస్థితులను తీసుకొని 100 ఎకరాల నుంచి వేల ఎకరాల్లో పరిశ్రమలు తెచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని సాకారం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వెళ్తామన్నారు. నేమకల్లు ఆంజనేయ స్వామి గోపురానికి సిజిఎఫ్ కింద రూ.3 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. పిల్లలు బాగా చదువు కుంటున్నారని ఈ ప్రాంతానికి బిసి రెసిడెన్షియల్ పాఠశాల కావాలని కోరారని, దానిని కూడా మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని, ఈ గ్రామంలో 98 శాతం మందికి అకౌంట్లు ఉన్నాయని, దానిని పూర్తిగా 100 శాతం చేయాలన్నారు. జిపిఎస్ మ్యాపింగ్ చేశామని, కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. మీ ఇంటికే పౌర సేవలు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని, సంపద సృష్టించి ఆ సంపదను పేద వాళ్లకు అందజేస్తామన్నారు.